Friday, 1 December 2017

నవంబర్ 2017 అంతర్జాతీయం

ఈజిప్టు మసీదులో బాంబు దాడిఈజిప్ట్‌లోని అల్ అరిష్ పట్టణంలో ఉన్న మసీదుపై నవంబర్ 24న ఉగ్రవాదులు దాడి చేశారు. ప్రార్థనలు చేసుకుంటున్న సూఫీ ముస్లింలపై బాంబులు, భారీ ఆయుధాలతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో దాదాపు 235 మంది మరణించగా 109 మంది గాయపడ్డారు. ఈజిప్టు చరిత్రలో ఇది అతిపెద్ద ఉగ్రదాడని ఈజిప్ట్ ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. 

మధ్యదరాలో 33 వేల మంది శరణార్థులు మృతిప్రపంచంలోని సరిహద్దుల్లో అత్యంత ప్రమాదకర, ప్రాణాంతక సరిహద్దుగా మధ్యదరా తీరాన్ని గుర్తించినట్లు ఐక్యరాజ్య సమితి పేర్కొంది. యూరప్ దేశాలకు వచ్చేందుకు మధ్యదరాలో సాహస ప్రయాణం చేస్తూ 2000 నుంచి 2016 వరకు 33 వేల మంది జల సమాధి అయినట్లు 2017 నవంబర్ 24న ఓ ప్రకటనలో తెలిపింది. 

ఐఎస్‌ను నిర్మూలించామని ప్రకటించిన ఇరాన్ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌ను దేశం నుంచి పూర్తిగా తరిమికొట్టామని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రూనీ 2017 నవంబర్ 21న ప్రకటించారు. తరచుగా ఉగ్ర దాడులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇరాన్.. ఇస్లామిక్ స్టేట్‌పై యుద్ధం ప్రకటించింది. నవంబర్ 18 నాటికి ఐఎస్‌ను నిర్మూలించామని ఇరాన్ సైన్యం ప్రకటించింది.

రోహింగ్యాలపై బంగ్లా, మయన్మార్ ఒప్పందంరోహింగ్యా శరణార్థులు స్వదేశానికి వచ్చేందుకు మయన్మార్ అంగీకరించింది. ఈ మేరకు మయన్మార్ రాజధాని నేపిదాలో 2017 నవంబర్ 23న మయన్మార్ నేత అంగ్‌సాన్ సూకీ, బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి మహమ్మూద్ అలీ ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. తమపై హింసాకాండతో మయన్మార్‌లోని రఖానే రాష్ర్టం నుంచి 6.20 లక్షల మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్ వలస వచ్చారు.

జింబాబ్వేలో సైనిక పాలనజింబాబ్వే సైన్యం ఆ దేశాన్ని తన చేతుల్లోకి తీసుకుని అధ్యక్షుడు రాబర్ట్ ముగాబేను ఆయన ఇంట్లోనే నిర్బంధించింది. అయితే ఇది సైనిక తిరుగుబాటు కాదనీ, అధ్యక్షుడు, ఆయన కుటుంబీకులు ఇంట్లో క్షేమంగానే ఉన్నారనీ, ముగాబే చుట్టూ ఉన్న నేరస్తులే తమ లక్ష్యమని ఆర్మీ జనరల్స్ నవంబర్ 15న వెల్లడించారు. తమ లక్ష్యం పూర్తయిన వెంటనే దేశంలో సాధారణ స్థితులు నెలకొంటాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. 
1980 నుంచీ ఆయనే.. గతంలో రొడీషియా అనే పేరున్న జింబాబ్వే నల్లజాతివారి సాయుధ పోరాటం ద్వారా బ్రిటిష్ పాలన నుంచి 1965లో స్వాతంత్య్రం ప్రకటించుకుంది. 1980 ఎన్నికల్లో విమోచన పోరాటం నడిపిన రాబర్ట్ ముగాబే నాయకత్వంలోని జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్ (జాను) విజయం సాధించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ముగాబేనే అధికారంలో ఉన్నారు. 93 ఏళ్ల ముగాబే ప్రస్తుతం పదవిలో ఉన్న ప్రపంచదేశాల అధ్యక్షుల్లోకెల్లా వయసులో పెద్దవారు. అలాగే 1980 నుంచి ఇప్పటికీ ఒక దేశాధ్యక్షుడిగా కొనసాగుతున్న వ్యక్తి ప్రపంచంలో ఈయన ఒక్కరే. ఇన్నేళ్ల పాలనలో సైన్యం ఆయనకు ఎదురుతిరగడం ఇదే తొలిసారి. 


యూరప్‌యేతర దేశాలకు బ్రిటన్ వీసాలు రెట్టింపు బ్రెగ్జిట్ అనంతర వ్యూహంలో భాగంగా బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో టెక్నాలజీ, కళలు, సృజనాత్మక పరిశ్రమల్లో పనిచేసే యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలకు చెందని నిపుణులకు ప్రస్తుతం జారీచేస్తున్న వీసాలను రెట్టింపు చేయాలని నిర్ణయించింది. అసాధారణ ప్రతిభ(ఎక్సెప్షనల్ టాలెంట్) ఉండే విదేశీయులకు టైర్-1 రూట్ ద్వారా ప్రస్తుతం 1,000 వీసాలు ఇస్తుండగా, దీన్ని 2 వేలకు పెంచుతామంది. 


డావెన్సీ చిత్రానికి 450 మిలియన్ డాలర్లు అత్యంత ప్రాచీన కళాసృష్టిలో ఒకటైన లియోనార్డో డావెన్సీ వేసిన దాదాపు 500 ఏళ్ల నాటి పెయింటింగ్ వేలంలో రికార్డు ధర పలికింది. న్యూయార్క్‌లో క్రిస్టీస్ నిర్వహించిన వేలంలో డావెన్సీ వేసిన సాల్వేటర్ ముండి’ జీసస్ క్రైస్ట్ చిత్రం 450.3 మిలియన్ డాలర్లు పలికింది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.2,941వేల కోట్లు. 
అత్యంత ఖరీదైన పెయింటింగ్‌గా డావెన్సీ జీసస్ క్రైస్ట్ పెయింటింగ్ నిలిచినట్లు క్రిస్టీస్ వెల్లడించింది. గతంలో 2015 క్రిస్టీస్ నిర్వహించిన వేలంలో పాబ్లో పికాసో వేసిన పెయింటింగ్ 179.4 మిలియన్ డాలర్లు పలికింది. ఈ రికార్డును డావెన్సీ పెయింటింగ్ అధిగమించింది. 

అమెరికా రక్షణ బడ్జెట్ 700 బిలియన్ డాలర్లువచ్చే ఏడాదికి అమెరికా భారీ రక్షణ బడ్జెట్‌ను ప్రకటించింది. నేషనల్ డిఫెన్‌‌స ఆథరైజేషన్ చట్టం-2018(ఎన్‌డీఏఏ) పేరిట రూపొందించిన 700 బిలియన్ డాలర్ల(సుమారు 45.44 లక్షల కోట్లు) బడ్జెట్‌ను అమెరికా కాంగ్రెస్ నవంబర్ 17న ఆమోదించింది. సైనిక, భద్రత సాయం పొందడానికి ఇందులో పాకిస్తాన్‌పై కఠిన ఆంక్షలు విధించారు. అదే సమయంలో భారత్‌తో రక్షణ సహకారాన్ని మరింత విస్తృతం చేసుకోవాలని ప్రతిపాదించారు. ఈ బిల్లుకు అమెరికా పార్లమెంట్‌లోని ఉభయ సభలు ప్రతినిధుల సభ, సెనేట్ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపాయి. ఇటీవలే దేశాధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన దక్షిణాసియా వ్యూహానికి ఇందులో చోటు కల్పించారు.
భారత్‌కు అమెరికా కల్పించిన ప్రధాన రక్షణ భాగస్వామి’ హోదాపై ఉమ్మడి నిర్వచనం ఇవ్వాలని విదేశాంగ, రక్షణ శాఖ మంత్రులను బిల్లు కోరింది. 2017 రక్షణ బడ్జెట్‌లోనే భారత్‌కు అమెరికా ప్రధాన రక్షణ భాగస్వామి హోదా ప్రకటించింది. ఈ గౌరవం భారత్‌కే ప్రత్యేకమని, దీని వల్ల రెండు దేశాల మధ్య రక్షణ వ్యాపారం, సాంకేతిక సహకారం అమెరికా మిత్ర దేశాలతో సమాన స్థాయికి చేరుతుందని కాంగ్రెస్ సభ్యులు అభిప్రాయపడ్డారు. 


కిల్లర్ రోబోలపై ఐరాస కమిటీ చర్చలుమానవ ప్రమేయం లేకుండానే శత్రువుల్ని గుర్తించి హతమార్చే రోబోల వినియోగంపై చర్చించేందుకు, నిబంధనల్ని రూపొందించేందుకు ఐక్యరాజ్యసమితి (ఐరాస)కు చెందిన ఓ కమిటీ నవంబర్ 17న అంగీకారం తెలిపింది. ఐదు రోజుల పాటు కిల్లర్ రోబో’ల వినియోగంపై సాగిన ఈ సమావేశంలో ఈ రోబోల్ని నిషేధించాలని పలు దేశాలు డిమాండ్ చేశాయి. ఈ రోబోల వినియోగంలో కొంతైనా మానవ ప్రమేయం ఉండాలన్నాయి. సైనిక బడ్జెట్‌తో పాటు సాంకేతికత తక్కువగా ఉన్న 22 దేశాలు ఈ మేరకు స్పందించాయి. ఈ సమావేశం నిబంధనల రూపకల్పనలో తొలి అడుగు అని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కిల్లర్ రోబోల వినియోగంపై వచ్చే ఏడాది మళ్లీ సమావేశమయ్యేందుకు పలు దేశాలు అంగీకరించాయి.

పార్టీ పదవి నుంచి రాబర్ట్ ముగాబే తొలగింపు జింబాబ్వే అధికార జాను-పీఎఫ్ పార్టీ చీఫ్ పదవి నుంచి ఆ దేశ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబేను తొలగించింది. ఆ స్థానంలో మాజీ ఉపాధ్యక్షుడు ఎమర్సన్ ఎమ్‌నాంగా గ్వా ని నియమించింది. 2018లో జరిగే ఎన్నికల్లో తమ అధ్యక్ష అభ్యర్థి ఎమర్సన్ అని ప్రకటించింది. ముగాబే భార్య గ్రేస్‌ను కూడా పార్టీ నుంచి తొలగించారు. ఇంతకముందు జింబాబ్వే ఆర్మీ ముగాబేను గృహ నిర్బంధంలోకి తీసుకుంది. 

ఉగ్ర ప్రోత్సాహ జాబితాలో ఉత్తర కొరియాఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాల జాబితాలో ఉత్తర కొరియాను చేరుస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. నవంబర్ 19న వైట్‌హౌస్‌లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఉత్తర కొరియాను ఎప్పుడో ఉగ్రవాద ప్రోత్సాహ దేశంగా గుర్తించాల్సిందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. తాజా నిర్ణయం నేపథ్యంలో ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షల్ని అమెరికా ఆర్థిక శాఖ వెల్లడిస్తుందని ఆయన చెప్పారు. 

జింబాబ్వే అధ్యక్షుడు ముగాబే రాజీనామా జింబాబ్వే అధ్యక్ష పదవికి రాబర్ట్ ముగాబే రాజీనామా చేశారు. పదవి నుంచి దిగిపోవాలని నలువైపులా పెరుగుతున్న ఒత్తిడి, ఆయన్ని అభిశంసించే ప్రక్రియను జింబాబ్వే పార్లమెంట్ ప్రారంభించడంతో ముగాబే దిగిరాక తప్పలేదు. దీంతో సుమారు 4 దశాబ్దాలుగా నిర్విరామంగా కొనసాగిన ఆయన పాలనకు తెరపడినట్లయింది. ఈ మేరకు నవంబర్ 21న ముగాబే పంపిన రాజీనామా లేఖను పార్లమెంట్ స్పీకర్ జాకబ్ ముడెండా పార్లమెంట్ ఉమ్మడి సమావేశంలో చదివి వినిపించారు. 
భార్య గ్రేస్‌ను తన వారసురాలిగా చేయాలనుకుని ఆమెకు పోటీగా ఉన్న ఉపాధ్యక్షుడు ఎమర్సన్‌ను ముగాబే పదవి నుంచి తొలగించడంతో దేశంలో అస్థిరత ఏర్పడింది. ఎమర్సన్‌కు అండగా నిలిచిన సైన్యం ముగాబే, ఆయన భార్యను గృహ నిర్బంధంలోకి తీసుకుంది. ముగాబే గద్దె దిగాల్సిందేనని దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళలు నిర్వహించారు. సొంత పార్టీ జాను-పీఎఫ్ ముగాబేను తమ చీఫ్‌గా తొలగించి ఎమర్సన్‌ను నియమించింది. 1980 నుంచి ముగాబేనే జింబాబ్వే అధ్యక్షుడిగా ఉన్నారు.


కాలుష్యం’పై మానవాళికి మరో హెచ్చరిక కాలుష్య కోరల్లో చిక్కుకుపోతున్న పుడమిని కాపాడాల్సిన సమయం మించిపోతోందని 15 వేల మందిపైగా శాస్త్రవేత్తలు నవంబర్ 13న హెచ్చరించారు. ధరిత్రిని రక్షించేందుకు తక్షణ చర్యలు అవసరమని ఉద్ఘాటించారు. ఇంత పెద్ద సంఖ్యలో శాస్త్రవేత్తలు ప్రకటన చేయడం ఇదే తొలిసారి. పాతికేళ్ల కిందట పలువురు నోబెల్ శాస్త్రవేత్తలు వాతావరణంపై ఒక అప్రమత్తత లేఖ రాయగా, ఇప్పుడు జారీ చేసిన ప్రకటన రెండో హెచ్చరిక. వరల్డ్ సైంటిస్ట్స్ వార్నింగ్ టు హ్యుమానిటీ: ఏ సెకండ్ నోటీస్’ పేరిట వెలువడిన ఈ హెచ్చరిక వ్యాసంపై 184 దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు సంతకాలు చేశారు.

బాన్‌లో ముగిసిన వాతావరణ సదస్సు పారిస్ ఒప్పందం అమలుకు ఉద్దేశించిన ఐరాస చర్చలు నవంబర్ 17న ముగిశాయి. జర్మనీలోని బాన్‌లో రెండు వారాలు సాగిన ఈ సంప్రదింపుల్లో 200 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, ఈ సదస్సులో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. వాతావరణ మార్పులను తట్టుకోవడానికి పేద దేశాలకు చేయాల్సిన సాయం, పారిస్ ఒప్పందం కింద పంచుకోవాల్సిన బాధ్యతలు వంటి అంశాల్లో ధనిక, వర్థమానదేశాల నడుమ విభేదాలు తలెత్తాయి. ఒప్పందం నుంచి త్వరగా వైదొలగనున్నట్లు అమెరికా పునరుద్ఘాటించింది. ఒడంబడిక తమ దేశానికి లబ్ధి చేకూర్చేదిగా ఉంటే భవిష్యత్‌లో తిరిగి చేరే వీలుందని పేర్కొంది.

యోగాకి సౌదీ అరేబియా అనుమతి యోగాభ్యాసం ఒక క్రీడ అని, దాన్ని అందరూ నేర్చుకోవచ్చని సౌదీ అరేబియా ప్రభుత్వం నవంబర్ 14న పేర్కొంది. శిక్షణ లెసైన్స్ ఉన్న టీచర్ల వద్ద ఎవరైనా యోగా నేర్చుకోవచ్చని తెలిపింది. సౌదీలో మొదటి యోగా ట్రైనర్‌గా పేరొందిన నూఫ్ మార్వాయి అనే మహిళ తమ దేశంలో యోగా గుర్తింపు కోసం పోరాడి విజయం సాధించారు. సౌదీ, గల్ఫ్ ప్రాంతాల్లో యోగా, ఆయుర్వేదాన్ని చాలాకాలంగా ప్రోత్సహిస్తున్న ఆమె యోగాకు, మతానికి సంబంధం లేదని మొదటి నుంచీ వాదిస్తున్నారు.

బ్రెగ్జిట్‌కు ముహూర్తం 2019, మార్చి 29 ఐరోపా సమాఖ్య(ఈయూ) నుంచి బ్రిటన్ విడిపోయేందుకు ముహూర్తం ఖరారైంది. 2019, మార్చి 29 ఈయూ నుంచి అధికారికంగా నిష్క్రమిస్తామని ప్రధాని థెరిసా మే నవంబర్ 10న ప్రకటించారు. బ్రెగ్జిట్ తేదీ, సమయాన్ని చేరుస్తూ సవరణలు చేసిన తరువాత ఈయూ నిష్క్రమణ చట్టాన్ని వచ్చే వారంలో హౌస్ ఆఫ్ కామన్‌‌సలో ప్రవేశపెడతామని పేర్కొన్నారు. ఈయూ నుంచి బ్రిటన్ విడిపోవడం ఖాయమని, ఈ విషయంలో ప్రభుత్వం నిబద్ధత, నిజాయతీపై సందేహం అక్కర్లేదని ది డైలీ టెలిగ్రాఫ్’కు రాసిన వ్యాసంలో ఆమె తెలిపారు. చారిత్రక ఈయూ నిష్క్రమణ చట్టం ముందరి పేజీలోనే బ్రెగ్జిట్ తేదీ, సమయాన్ని స్పష్టంగా ప్రచురిస్తామని వెల్లడించారు. 


అంతరిక్ష పిల్లికి కాంస్య విగ్రహంఅంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన ఏకైక పిల్లిగా గుర్తింపు పొందిన ఫెలికిట్టె’కి మరో అరుదైన గౌరవం లభించనుంది. ఫ్రాన్స్లో ఐదడుగుల ఫెలికిట్టె’ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి లండన్‌కు చెందిన మాథ్యూ గై అనే వ్యక్తి కిక్‌స్టార్టర్ వెబ్‌సైట్‌లో నిధుల సేకరణను ప్రారంభించారు. 
1963 అక్టోబర్ 18న ఫ్రాన్స్ ప్రయోగించిన వెరొనిక్ ఏజీ1 రాకెట్‌లో ఈ పిల్లి భూమి నుంచి 157 కి.మీ. మేర అంతరిక్షంలోకి ప్రయాణించి, 15 నిమిషాల అనంతరం సురక్షితంగా భూమిపైకి చేరుకుంది. ఒక పిల్లి అంతరిక్షంలోకి వెళ్లిన సంగతిని ప్రజలకు తెలిపేందుకే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నానని మాథ్యూ తెలిపారు. 


ఇరాక్ - ఇరాన్ సరిహద్దులో భారీ భూకంపం రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం ఇరాక్-ఇరాన్ సరిహద్దుల్లో భారీ విధ్వంసం సృష్టించింది. భూకంప తీవ్రతకు భారీ భవనాలు, ఇళ్లు నేలమట్టవడంతో రెండు దేశాల్లో మొత్తం 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 7 వేల మంది గాయపడ్డారు. 
ఇరాక్‌లోని హలబ్జ పట్టణానికి 31 కిలోమీటర్ల దూరంలో, భూ ఉపరితలం నుంచి 23.2 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని అమెరికా భూ పరిశీలన సంస్థ తెలిపింది. ఇరాన్, ఇరాక్ స్థానిక కాలమానం ప్రకారం నవంబర్ 12న రాత్రి 9.48 గంటల (భారత కాలమానం నవంబర్ 12న రాత్రి 11.48 గంటలు) సమయంలో భూప్రకంపనలు మొదలయ్యాయి. కొద్ది క్షణాల్లో ఇరాన్ పశ్చిమ ప్రాంతంలోని కెర్మన్‌షా ప్రావిన్సు, ఇరాక్ ఉత్తర భాగంలోని కుర్దిష్ ప్రావిన్సుల్లో పలు ప్రాంతాలు శిథిలాల దిబ్బగా మారిపోయాయి.


దక్షిణ చైనా సముద్రంపై చైనా, వియత్నాం రాజీదక్షిణ చైనా సముద్రం వివాదం విషయంలో చైనా, వియత్నాం రాజీకొచ్చాయి. ఆ విషయంలో వెనక్కి తగ్గేందుకు ఇరు దేశాలు నవంబర్ 13న అంగీకరించాయి. దాదాపు 5 ట్రిలియన్ డాలర్ల నౌకా రవాణా వాణిజ్యం జరిగే ఈ దక్షిణ చైనా సముద్రం విషయంలో చైనా, వియత్నాంతో పాటు బ్రూనై, తైవాన్, ఫిలిప్పీన్‌‌స మధ్య ఎంతో కాలంగా వివాదం నలుగుతోంది. ఈ సముద్రంలో చైనా ఓ అడుగు ముందుకేసి మిలిటరీ కార్యకలాపాలు సాగించేందుకు వీలుగా ఏకంగా కృత్రిమ ద్వీపాలను నిర్మించింది. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ హనోయ్ పర్యటన సందర్భంగా ఈ సముద్రం విషయంలో శాంతి నెలకొల్పేందుకు కృషి చేస్తామని రెండు దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో అంగీకరించాయి. 


మనీలాలో ఆసియాన్, తూర్పు ఆసియా సదస్సు ఉగ్రవాదం, తీవ్రవాదంతో పాటు సీమాంతర ఉగ్రవాదం మనం ఎదుర్కొం టున్న ప్రధాన సవాళ్లని, అన్ని దేశాలు వాటిని సమష్టిగా ఎదుర్కొనే సమయం ఆసన్నమైందని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అలాగే ఇండో-పసిఫిక్ ప్రాంతంలో నిబంధనల ఆధారిత ప్రాంతీయ భద్రతా విధానం ఎంతో అవసరమని ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో జరిగిన 31వ ఆసియాన్-భారత్’ సదస్సులో నవంబర్ 14న మోదీ పేర్కొన్నారు. 
ఆసియాన్ దేశాధినేతలకు ఆహ్వానం భారత్, ఆసియాన్ మధ్య పరస్పర విలువలు, ఉమ్మడి లక్ష్యం’పై ప్రసంగించిన ప్రధాని మోదీ.. 25, జనవరి 2018న న్యూఢిల్లీలో ఇండో-ఆసియాన్ ప్రత్యేక సదస్సుకి దేశాధినేతలను ఆహ్వానించారు. 
ఆసియాన్ సభ్య దేశాలు.. ఆసియాన్‌లో థాయ్‌లాండ్, వియత్నాం, ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, మయన్మార్, కంబోడియా, లావోస్, బ్రూనైలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అత్యంత ప్రభావవంతమైన కూటమిలో ఒకటైన ఆసియాన్‌లో భారత్, అమెరికా, చైనా, జపాన్, ఆస్ట్రేలియాలు చర్చల్లో భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. ఆసియాన్ సదస్సుతో పాటు.. ప్రధాని నరేంద్ర మోదీ రీజినల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్‌షిప్’(ఆర్‌సీఈపీ) సదస్సులో కూడా పాల్గొన్నారు. ఆర్‌సీఈపీలో 10 ఆసియాన్ సభ్య దేశాలతో పాటు, భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ భాగస్వాములుగా ఉన్నాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై ఈ దేశాలు చర్చలు కొనసాగించాయి. 
తూర్పు ఆసియా’ది కీలక పాత్ర ఆసియాన్-భారత్ సదస్సుతో పాటు.. తూర్పు ఆసియా సదస్సులో కూడా ప్రధాని ప్రసంగించారు. తూర్పు ఆసియా ప్రాంతంలో రాజకీయ, భద్రత, వాణిజ్యపర అంశాల పరిష్కారంలో భారత్ పూర్తి సహకారం అందిస్తుందని, ఆ కూటమితో కలిసి పనిచేసేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఈస్ట్ ఆసియా సదస్సు ఎంతో ముఖ్యమైన వేదిక. 2005లో ప్రారంభమైన ఈ సదస్సు వ్యూహాత్మక అంశాలు, అంతర్జాతీయ రాజకీయాలు, తూర్పు ఆసియా ఆర్థిక వికాసంలో గణనీయమైన పాత్ర పోషిస్తోంది. తూర్పు ఆసియా సదస్సులో ఆసియాన్ సభ్య దేశాలతో పాటు, భారత్, చైనా, జపాన్, దక్షిణకొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, రష్యాలు కూడా భాగస్వాములుగా ఉన్నాయి. 

నాలుగు దేశాల చతుర్భుజ కూటమి !ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఎదురులేని ఆర్థిక, సైనిక శక్తిగా అవతరించిన చైనా ఆధిపత్య ధోరణిని కట్టడిచేయడానికి రంగం సిద్ధమైంది. దక్షిణ చైనా సముద్రంపై పూర్తి పెత్తనం కోరుతున్న చైనా ఆటలు సాగకుండా అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్‌తో కూడిన నాలుగుదేశాల కూటమి (క్వాడ్రిలేటరల్-క్వాడ్) అవసరమని జపాన్ ప్రధాని షింజో అబే 2007లోనే భారత పార్లమెంటులో ప్రసంగిస్తూ సూచించారు. తర్వాత నెల రోజులకే ఆయన పదవి నుంచి వైదొలిగాక ఈ ‘చైనా వ్యతిరేక’ చతుర్భుజం ప్రతిపాదన మరుగునపడిపోయింది. మళ్లీ ఇన్నేళ్లకు అబే ప్రధానిగా తన స్థానం బలోపేతం చేసుకున్నాక ఈ ప్రతిపాదనకు గట్టి ఆమోదముద్ర లభించింది. 31వ ఆగ్నేయాసియా, 12వ తూర్పు ఆసియా సదస్సుల్లో పాల్గొనడానికి ఫిలిప్పీన్‌‌స వచ్చిన ఈ నాలుగు దేశాల అధికారులు మనీలాలో నవంబర్ 12న సమావేశమయ్యారు. నాలుగు రాజ్యాల కూటమి ప్రతిపాదనపై ఉన్నతాధికారుల స్థాయిలో అక్కడ చర్చలు జరిగాయి. 
షింజో లక్ష్యమేంటి?అంతర్జాతీయ ఆర్థిక ప్రపంచంలో ప్రధానపాత్ర పోషించే ఆసియా, పసిఫిక్ దేశాలకు రవాణాపరంగా దక్షిణ చైనా సముద్రం ఎంతో కీలకమైనది. అయితే ప్రపంచీకరణ ఫలాలతో బలమైన ఆర్థికశక్తిగా ఎదిగిన చైనా ఈ సముద్ర ప్రాంతంపై పూర్తి ఆధిపత్యం సాధించేలా దుందుడుకుగా వ్యవహరిస్తోంది. పొరుగు దేశాలను బెదిరించే ధోరణిలో ప్రకటనలు చేస్తోంది. అలాగే గతంలో జపాన్ చైనాతో ప్రాదేశిక వివాదాలను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టు రాజ్యం అనుసరించే పెత్తందారీ ధోరణులకు వ్యతిరేకంగా సంకీర్ణం నిర్మించాలనే పట్టుదలతో జపాన్ ఉంది. తాజా పరిణామాల ఫలితంగా చైనాకు ఇండియా మరింత దూరం కావడంతో భారత్‌ను ఈ కూటమిలో చేర్చుకోవడానికి ఇదే మంచి తరుణమని కూడా అబే భావిస్తున్నారు. అలాగే అధ్యక్షపదవి చేపట్టినప్పటి నుంచీ చైనాను కట్టడి చేయడానికి ట్రంప్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అమెరికా కూడా ఈ కూటమి ప్రతిపాదనపై ఆసక్తి ప్రదర్శిస్తోంది. అమెరికాను అనుసరించే ఆస్ట్రేలియా కూడా ఇప్పుడు ‘చతుర్భుజం’ లో భాగంకావడానికి సిద్ధమైంది.
కూటమిలోకి భారత్? హిందూ మహాసముద్రం, ఆగ్నేయాసియా ప్రాంతం మీదుగా ముడి చమురు చైనాకు రవాణా అవుతోంది. అందుకే ఈ ప్రాంతాలపై తన ప్రభావం, ఆధిపత్యం ఉండేలా చైనా పావులు కదుపుతూ చాలా వరకు అనుకున్నది సాధించింది. దౌత్య, ప్రాంతీయ సంబంధాల్లో భారత్ కొంత వెనుకబడటం చైనాకు ఇప్పటి వరకూ కలిసొచ్చింది. అయితే ఇటీవల రెండు నెలలకు పైగా డోక్లామ్ వివాదంతో భారత్ విసిగిపోయింది. ఈ నేపథ్యంలో చైనాను కట్టడి చేసేందుకు ‘క్వాడ్’ కూటమిలో చేరడం ఇప్పుడు భారత్‌కు మంచి అవకాశంగా కనిపిస్తోంది. మనీలాలో జరిగిన అధికారుల స్థాయి చతుర్భుజ కూటమి సమావేశంలో నాలుగు దేశాల ప్రతినిధులూ వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో అందరూ అంతర్జాతీయ చట్టాలను అనుసరించడం, సముద్రాల్లో నౌకలు, ఆకాశంలో విమానాల రవాణాకు అడ్డంకులు లేకుండా చూడడం, ఓడలకు భద్రత కల్పిస్తూ, ఉగ్రవాదుల నుంచి సవాళ్లను దీటుగా ఎదుర్కోవడం వంటి అంశాలపై చర్చించారు. చైనా తన ఆర్థిక అవసరాలకు అనుగుణంగా వన్ బెల్డ్- వన్ రోడ్ ప్రాజెక్టును ఆర్భాటంగా చేపడుతుండగా, ఇందుకు ప్రత్యామ్నాయంగా ట్రంప్ కూడా ఓ ఆర్థిక, మౌలిక సదుపాయాల ప్రాజెక్టును ఈ ప్రాంతంలో సూచిస్తున్నారు. ఈ కూటమి బలపడితే కొత్త ప్రాజెక్టు పని సులువవుతుందనీ పలువురు భావిస్తున్నారు. ఏదేమై నా ఆర్థికంగా బలమైన 4 పెద్ద దేశాలు అంతర్జాతీయ చట్టాల పరిరక్షణ పేరుతో చేతులు కలపడం చైనాకు పెద్ద సవాలే.

ఫెడ్ చైర్మన్‌గా జెరోమ్ పావెల్అమెరికా ఫెడరల్ రిజర్వ్ తదుపరి చైర్మన్‌గా జెరోమ్ పావెల్ (64) పేరును అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సెనేట్ కూడా ఆమోదముద్ర వేస్తే పావెల్ నియామకం ఖరారు కానుంది. ప్రస్తుత ఫెడ్ చైర్మన్ జానెట్ యెలెన్ పదవీకాలం ఫిబ్రవరితో ముగియనుంది. రిపబ్లికన్ పార్టీకి చెందిన పావెల్ 2012 నుంచి ఫెడరల్ రిజర్వ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌లో ఒకరిగా కొనసాగుతున్నారు. ప్రపంచ ఎకానమీకే దిశానిర్దేశం చేసే ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ పదవిని అమెరికా ప్రభుత్వంలో రెండో అత్యంత శక్తిమంతమైన హోదాగా పరిగణిస్తారు. 


ప్యారడైజ్ పత్రాల్లో 714 మంది భారతీయుల పేర్లుఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) నవంబర్ 5న విడుదల చేసిన ప్యారడైజ్ పత్రాల్లో భారత్‌కు చెందిన 714 మందితో పాటు ప్రపంచంలోని 120 మంది రాజకీయ ప్రముఖుల పేర్లున్నాయి. ఇందులో బ్రిటన్ రాణి ఎలిజబెత్-2, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కేబినెట్ సహచరుడు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సన్నిహితుల పేర్లూ ఉన్నాయి. జర్మన్ పత్రిక సుడుషె జైటంగ్ పత్రిక ఈ వివరాలను సేకరించిందని ఐసీఐజే తెలిపింది.
విదేశీ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి దాదాపు కోటి 34 లక్షల పేపర్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఐసీఐజే ఈ జాబితాను వెల్లడిచింది. ముఖ్యంగా బెర్ముడా చుట్టూ ఉన్న దీవుల కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీల్లో 180 దేశాలకు చెందిన ప్రముఖులు పెట్టుబడులు పెట్టగా, 714 పేర్లతో భారత్ 19వ స్థానంలో ఉందని తెలిపింది. అలాగే యాపిల్, నైక్, ఉబర్ సహా.. దాదాపు 100 బహుళజాతి సంస్థలు డొల్ల కంపెనీల ఏర్పాటుకు ప్రయత్నించాయని తెలిపింది.
ప్యారడైజ్ పత్రాల జాబితాలో భారత్ నుంచి కేంద్ర మంత్రి జయంత్ సిన్హా, రాజ్యసభ బీజేపీ ఎంపీ ఆర్కే సిన్హా, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్, చిదంబరం కుమారుడు కార్తీ, అమితాబ్ బచ్చన్, విజయ్ మాల్య, నీరా రాడియా, సంజయ్‌దత్ భార్య మాన్యతాదత్ (దిల్‌నాషిన్) తదితరులున్నారు.


జపాన్ చక్రవర్తితో ట్రంప్ భేటీఆసియా పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జపాన్ చక్రవర్తితోపాటు ఆ దేశ ప్రధాని షింజో అబేతో నవంబర్ 6న భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉత్తర కొరియాతో పాటు ఇతర అంతర్జాతీయ సమస్యలపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. ట్రంప్ 12 రోజులపాటు జపాన్, చైనా సహా పలు ఆసియా దేశాల్లో పర్యటిస్తారు.


వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ‘ఫేక్ న్యూస్’ 
2017 సంవత్సరానికి వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ‘ఫేక్ న్యూస్’ను కొల్లిన్స్ డిక్షనరీ నవంబర్ 3న లండన్‌లో ప్రకటించింది. ఈ పదాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్కువగా వాడారు. దీని వాడకం గత 12 నెలల్లో 365 శాతం పెరిగింది. సంచలనం కలిగించే రీతిలో అసత్య వార్తలను అందించడాన్ని ఫేక్ న్యూస్‌గా పేర్కొంటారు.

లెబనాన్ ప్రధాని రాజీనామా లెబనాన్ ప్రధానమంత్రి సాద్ హరిరి తన పదవికి నవంబర్ 4న అనూహ్యంగా రాజీనామా చేశారు. పాలనా పగ్గాలు చేపట్టిన ఏడాది వ్యవధిలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దేశంలో రాజకీయ పరిణామాలు మారడం, హరిరి హత్యకు దారి తీసే పరిస్థితులు నెలకొనడం, లెబనాన్‌తోపాటు మధ్యప్రాచ్యంలో ఇరాన్ ఆధిపత్యం పెరుగుతుండటం దీనికి కారణాలని భావిస్తున్నారు. ఇరాన్‌కు వ్యతిరేకంగా హరిరి గతంలో పలుమార్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

అంతర్జాతీయ వాతావరణ సదస్సుఅంతర్జాతీయ వాతావరణ సదస్సు జర్మనీలోని బాన్‌లో నవంబర్ 6న ప్రారంభమైంది. వాతావరణ మార్పులతో తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్న అనేక ద్వీప దేశాల్లో ఒకటైన ఫిజీ సదస్సుకు అధ్యక్షత వహిస్తోంది. ఈ కార్యక్రమం 12 రోజుల పాటు జరగనుంది. వాతావరణ మార్పులపై తక్షణ చర్యలు అవసరమని ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఫిజీ ప్రధానమంత్రి ఫ్రాంక్ బైనిమరామా ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. వాతావరణ మార్పులను భారత్ పెద్ద ముప్పుగా భావిస్తోందని మన దేశం తరఫున ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్దన్ పేర్కొన్నారు.

No comments:

Post a Comment