Thursday, 28 June 2018

మే 2018 అంతర్జాతీయం

కేంబ్రిడ్జ్ అనలిటికా మూసివేతఫేస్‌బుక్ యూజర్ల డేటా దుర్వినియోగంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిటన్‌కు చెందిన డేటా కన్సల్టింగ్ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికా మూతపడింది. వ్యాపారంలో నష్టాలు రావడం వల్లే మూసివేస్తున్నట్టు సంస్థ యాజమాన్యం మే 3న ప్రకటించింది. 
8.7 కోట్ల మంది ఫేస్‌బుక్ యూజర్ల సమాచారాన్ని సేకరించి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా వాడినట్టు అనలిటికాపై ఆరోపణలు వచ్చాయి. అలాగే బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఇదే విధానాన్ని ఉపయోగించినట్టు, భారత్‌లోనూ సుమారు 5 లక్షల మంది యూజర్ల సమాచారాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం చేసినట్టు వెలుగులోకి రావడంతో ఆ సంస్థ వివాదాల్లో చిక్కుకుంది. 

ఉభయ కొరియాల్లో ఒకే ప్రామాణిక సమయంఉభయ కొరియా దేశాల్లో ఒకే ప్రామాణిక సమయం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ఉత్తరకొరియా తన ప్రామాణిక సమయాన్ని మే 4న 30 నిమిషాలు ముందుకు జరిపింది. ఇటీవల ఉభయ కొరియాల సమావేశానికి ఆతిథ్యమిచ్చిన సరిహద్దు గ్రామంలోని గడియారాల్లో వేర్వేరు సమయాలను చూసిన ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఇరు దేశాల ప్రామాణిక సమయం ఒకేలా ఉండేలా మార్పులు చేస్తామని తెలిపాడు.

రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ప్రమాణస్వీకారంరష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు మే 7న అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్యాలెస్‌లో బాధ్యతలు స్వీకరించిన పుతిన్ 2024 వరకు పదవిలో కొనసాగుతారు. 2018 మార్చిలో జరిగిన ఎన్నికల్లో పుతిన్‌కు 77 శాతం ఓట్లు వచ్చారుు. దీంతో జోసెఫ్ స్టాలిన్ తర్వాత ఎక్కువకాలం రష్యా అధ్యక్షుడిగా కొనసాగిన రికార్డు పుతిన్ సొంతం కానుంది.


ఇరాన్ అణు ఒప్పందం నుంచి వైదొలిగిన అమెరికాఏడు సభ్యదేశాలతో ఏర్పాటైన ఇరాన్ అణు ఒప్పందం నుంచి వెదొలగుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మే 8న ప్రకటించారు. ఇరాన్ అణ్వాయుధాలు ఉత్పత్తి చేయకుండా నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో 2015లో వియన్నాలో ఉమ్మడి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (జేసీపీవోఏ) ఒప్పందం కుదిరింది. అయితే అమెరికాతో సంబంధం లేకుండా ఒప్పందానికి కట్టుబడి ఉంటామని ఫ్రాన్‌‌స, బ్రిటన్, రష్యా, చైనా, జర్మనీ, ఇరాన్ లు ప్రకటించాయి.

బ్రిటన్ హోం మంత్రిగా పాక్ సంతతి వ్యక్తి బ్రిటన్ చరిత్రలో తొలిసారి పాకిస్తాన్ సంతతికి చెందిన వ్యక్తి సాజిద్ జావెద్ హోం మంత్రిగా నియమితులయ్యారు. అక్రమ వలసదారుల్ని దేశం నుంచి పంపే విషయంలో పార్లమెంటును తప్పుదారి పట్టించినందుకు అంబర్ రూడ్ పదవి నుంచి వైదొలగడంతో ఏప్రిల్ 30న సాజిద్‌ను హోంమంత్రిగా నియమించారు. సాజిద్ 2010 నుంచి కన్జర్వేటివ్ పార్టీ ఎంపీగా ఉన్నాడు.
పాకిస్తాన్‌కు చెందిన బస్సు డ్రైవర్ కుమారుడైన సాజిద్ కుటుంబం 1960 ల్లో బ్రిటన్‌కు వలస వచ్చింది. బ్రిటన్ చరిత్రలో కీలకమైన మంత్రిత్వ శాఖను నిర్వహించే మొదటి దక్షిణాసియా వ్యక్తి సాజిదే. ఇప్పటికే పాక్ మూలాలున్న సాదిక్ ఖాన్ లండన్ మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.


ఉత్తర, దక్షిణ కొరియా అధ్యక్షుల భేటీ
ఉత్తర, దక్షణ కొరియా అధ్యక్షుల చారిత్రక భేటీ ఏప్రిల్ 27న జరిగింది. రెండు దేశాలను వేరు చేసే సైనిక విభజన రేఖ వద్ద ఇరు దేశాల అధ్యక్షులు కరచాలనం చేసుకున్నారు. అనంతరం కిమ్ జోంగ్ ఉన్ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జాయ్ ఇన్‌ను తమ దేశంలోకి ఆహ్వానించారు. తర్వాత ఇద్దరూ కలసి దక్షిణ కొరియాలోకి కొంత దూరం నడుచుకుంటూ వెళ్లారు. తర్వాత జరిగిన ద్వైపాక్షిక భేటీలో ఇరు దేశాల అధ్యక్షులు చారిత్రక ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇందులో కొరియా ద్వీపకల్పాన్ని అణ్వాయుధ రహితంగా మార్చడాన్ని ఉమ్మడి లక్ష్యంగా పేర్కొన్నారు.

రష్యాలో తేలియాడే అణు విద్యుత్ కేంద్రం 
రష్యా ‘అకడమిక్ లోమనోసోవ్’ అనే సముద్రంలో తేలియాడే అణువిద్యుత్ కేంద్రాన్ని నిర్మించింది. ఇది ప్రపంచంలోనే తొలి తేలియాడే అణువిద్యుత్ కేంద్రం కావడం గమనార్హం. దీన్ని రష్యా అణుశక్తి కార్పొరేషన్ సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని షిప్‌యార్డ్‌లో నిర్మించి.. చుకోట్కా పోర్ట్ ఆఫ్ పెవెక్‌కు తరలిస్తోంది. అక్కడికి వెళ్లిన తర్వాత ఇంధనం నింపి ఉత్పత్తిని ప్రారంభిస్తారు. ఇది ఉత్పత్తి ప్రారంభిస్తే ఏటా 50 వేల టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాన్ని తగ్గించొచ్చని అంచనా.


ఏప్రిల్ 2018 అంతర్జాతీయం

ప్రపంచ రుణ భారం 164 ట్రిలియన్ డాలర్లుప్రపంచ రుణ భారం భారీగా పెరిగిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొంది. 2016 నాటికి 164 ట్రిలియన్ డాలర్లకు చేరిందని తెలిపింది. ప్రపంచ వార్షిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చితే ఇది 225 శాతం అధికం. 2017లో భారత రుణ భారం జీడీపీలో 70 శాతంగా ఉంది.


లండన్‌లో చోగమ్ సదస్సు
కామన్వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల సదస్సు 2018 (చోగమ్)ను క్వీన్ ఎలిజబెత్ ఏప్రిల్ 19న లండన్‌లో ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన 91 ఏళ్ల రాణి క్వీన్ ఎలిజబెత్ కామన్వెల్త్ చీఫ్‌గా తన కొడుకు ప్రిన్స్ చార్లెస్ పేరును ప్రతిపాదించారు.
చోగమ్ సదస్సులో పాల్గొనడానికి లండన్ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, మారిషస్ ప్రధాని జుగ్‌నౌత్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో మోదీ సమావేశమయ్యారు.


అణు పరీక్షలు నిలిపేసిన ఉత్తర కొరియా
నిరంతర ఆయుధ పరీక్షలతో ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఉత్తర కొరియా అణు పరీక్షలు, ఖండాంతర క్షిపణి ప్రయోగాలను నిలిపేయాలని నిర్ణయించింది. త్వరలోనే దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ భేటీ కానున్నందున ఈ మేరకు ప్రకటించింది. 
ఏప్రిల్ 21న జరిగిన అధికార వర్కర్స్ పార్టీ ప్లీనరీ సమావేశంలో ‘అవసరమైన ఆయుధాలు, క్షిపణులపై అమర్చే సూక్ష్మ వార్‌హెడ్లను అభివృద్ధి చేసుకున్నాం. ఇక మనకు అణు పరీక్షలు, మధ్యంతర, ఖండాంతర క్షిపణుల అవసరం లేదు’ అని కిమ్ అన్నారని ఆ దేశ అధికారిక వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్‌ఏ) వెల్లడించింది.


అల్జీరియాలో కూలిన సైనిక విమానం ఆఫ్రికా దేశమైన అల్జీరియాలో ఏప్రిల్ 11న సైనిక విమానం కూలి 257 మంది మృతి చెందారు. ఆర్మీ సిబ్బందితోపాటు వారి కుటుంబాలతో రాజధాని అల్జీర్స్‌కి దగ్గర్లోని బౌఫరిక్ సైనిక కేంద్రం నుంచి పశ్చిమ సహారా సమీపంలోని బెచార్ నగరానికి వెళ్తుండగా విమానం ప్రమాదానికి గురైంది. 2014లో ఉక్రెయిన్‌లో మలేసియా విమానాన్ని వేర్పాటువాదులు కూల్చిన దుర్ఘటనలో 298 మరణించిన అనంతరం జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదం ఇదే . కాగా ప్రమాదానికి గురైన ఇల్యుషిన్ 2-76 రవాణా విమానం రష్యాలో తయారైంది. 


పాకిస్తాన్ మాజీ ప్రధాని షరీఫ్ పై నిషేధం
పనామా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పై ఆ దేశ సుప్రీంకోర్టు జీవితకాల నిషేధం విధించింది. షరీఫ్‌తో పాటు పాకిస్తాన్ తెహ్రికీ ఇన్సాఫ్ (పీటీఐ) నేత జహంగీర్ తరీన్‌పై కూడా రాజకీయ నిషేధం విదిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. పనామా పేపర్స్ కేసులో షరీఫ్ 2017 జూలై 28న తన ఎంపీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీ అధ్యక్ష పదవులకు రాజీనామా చేశారు. పాక్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 62 (1) (ఎఫ్) ప్రకారం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ చట్టసభ్యుడిపై నిషేధం విధించవచ్చు.

సిరియాపై క్షిపణుల దాడి
అంతర్యుద్ధంతో నెత్తురోడుతున్న సిరియాపై అమెరికా సంకీర్ణ బలగాలు క్షిపణి దాడులు జరిపాయి. రసాయనిక ఆయుధాలతో రష్యా, సిరియా అధ్యక్షుడు అసద్ నేతృత్వంలోని ప్రభుత్వ దళాలు వందలాది అమాయకులు, చిన్నారుల్ని పొట్టన పెట్టుకున్నందుకు ప్రతీకారంగా సిరియా రాజధాని డమాస్కస్‌పై దాడి చేస్తామని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ మేరకు దాడులు జరిపినట్లు ట్వీట్ చేశారు. ఈ దాడులు అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లతో పాటు 100కి పైగా మిత్రదేశాలు సంయుక్తంగా నిర్వహించాయి.


పార్క్ గుయెన్ హై కి 24 ఏళ్ల జైలు శిక్షఅవినీతి కేసులో దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్ గుయెన్ హై కి 24 ఏళ్ల జైలు శిక్ష పడింది. కొరియా తొలి మహిళా అధ్యక్షురాలిగా 2013లో చరిత్రకెక్కిన గుయెన్ లంచం, అధికార దుర్వినియోగం వంటి పలు కేసుల్లో దోషిగా తేలారు. పార్క్ ప్రముఖ వ్యాపారవేత్త చోయి సూన్ సిల్ తో కలసి దాదాపు రూ.140 కోట్లు లంచంగా డిమాండ్ చేశారు. ఈమె దక్షిణ కొరియా నియంత పార్క్ చుంగ్ హీ కుమార్తె.

ఐరాస ఉగ్ర జాబితాలో అగ్రభాగాన పాక్ఐక్యరాజ్యసమితి ఏప్రిల్ 3న వెల్లడించిన ఉగ్రవాదుల జాబితాలో 139 మందితో పాకిస్థాన్ అగ్రభాగాన నిలిచింది. పాకిస్తాన్‌లో నివసిస్తూ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని ఈ జాబితాలో చేర్చారు. ఇందులో అల్‌ఖైదా నేత అల్ జవహరి ముందు వరుసలో ఉన్నారు. 

అలీనోద్యమ దేశాల మంత్రుల సమావేశంఅజర్‌బైజాన్ రాజధాని బాకూలో ఏప్రిల్ 5న అలీనోద్యమ(నామ్) దేశాల 18వ మధ్యకాలిక సమావేశం జరిగింది. దీనికి భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ శాంతి, భద్రతకు ఉగ్రవాదం పెనుముప్పులా పరిణమించిందన్నారు.

మయన్మార్ అధ్యక్షుడిగా విన్ మైంట్మయన్మార్ నూతన అధ్యక్షుడిగా అంగ్‌సాన్ సూచీ అనుచరుడు విన్ మైంట్ మార్చి 28న ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు హితిన్ క్యా తన పదవికి రాజీనామా చేయడంతో నూతన అధ్యక్షుడి కోసం పార్లమెంటులో ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్‌లో విన్ (ఎన్‌ఎల్‌డీ) కు మూడింట రెండు వంతుల మెజారిటీ లభించింది.
2015లో జరిగిన ఎన్నికల్లో సూచీ పార్టీ భారీ విజయం సాధించింది. అయితే సూచీ ఓ విదేశీయుణ్ణి పెళ్లి చేసుకోవడంతో, ఇక్కడి మిలిటరీ రాజ్యాంగం ప్రకారం ఆమె అధ్యక్ష పదవి చేపట్టేందుకు అనర్హురాలైంది.

అణు నిరాయుధీకరణకు సమ్మతమే: కిమ్ఉత్తర కొరియాలో అణు నిరాయుధీకరణకు సమ్మతంగా ఉన్నట్లు ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ స్పష్టం చేశారు. మార్చి 25 నుంచి 28 వరకు నాలుగు రోజుల పాటు బీజింగ్‌లో పర్యటించిన కిమ్ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించాడు. కొరియా ద్వీపకల్పంలో అణ్వాయుధాలు లేకుండా చేస్తానని కిమ్ స్పష్టం చేశాడు. త్వరలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం నేపథ్యంలో కిమ్ రహస్య చైనా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

వేతన వివక్షపై ‘పేమీటూ’ పేరిట కొత్త ఉద్యమం

మహిళలపై కొనసాగుతున్న వేతన వివక్షకు వ్యతిరేకంగా బ్రిటన్‌లోని లేబర్ పార్టీకి చెందిన ఎంపీ స్టెలా క్రీజీ నేతృత్వంలో #paymetoo అనే ఉద్యమం ప్రారంభమైంది. మహిళలకు సమానంగా వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదని ఉద్యోగులు యాజమాన్యాలను అడగడమే ఈ ఉద్యమం ప్రధాన ఉద్దేశం. 250కి పైగా ఉద్యోగులు ఉన్న ప్రైవేటు కంపెనీలన్నీ ఒక గంట పనికి మహిళలకు, పురుషులకు చెల్లించే వేతనాల్లో వ్యత్యాసాన్ని తప్పనిసరిగా బయటపెట్టాలంటూ బ్రిటన్ కొత్త చట్టం చేసింది. ఇందుకోసం ఏప్రిల్ 4 వరకు గడువు ఇచ్చింది. 
భారత్‌లో కూడా ఒకే హోదాలో, ఒకే పనిచేస్తున్న పురుషుల కంటే మహిళల వేతనాలు 20 శాతం తక్కువగా ఉన్నాయని తాజా అధ్యయనాలు వెల్లడించాయి.

అమెరికా వస్తువులపై చైనా దిగుమతి సుంకం
అమెరికా నుంచి చైనాకు దిగుమతయ్యే 128 వస్తువులపై చైనా తాజాగా దిగుమతి సుంకం విధించింది. అమెరికాకు దిగుమతయ్యే ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా విధించిన సుంకాలకు ప్రతిగా చైనా ఈ చర్య చేపట్టింది. పండ్లు, సంబంధిత 120 ఉత్పత్తులపై 15%, పంది మాంసం, సంబంధిత 8 ఉత్పత్తులపై 25% చొప్పున సుంకం విధించింది.

ఈజిప్ట్ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన ఎల్ సిసీఈజిప్ట్ అధ్యక్షుడిగా అబ్దెల్ ఫత్తాహ్ ఎల్ సిసీ తిరిగి ఎన్నికయ్యారు. ఆయనకు అధ్యక్ష ఎన్నికల్లో 97.08 శాతం ఓట్లు లభించినట్లు జాతీయ ఎన్నికల సంస్థ(ఎన్‌ఈఏ) ఏప్రిల్ 2న ప్రకటించింది.

కోస్టారికా అధ్యక్షుడిగా కార్లోస్ అల్వరాడో
కోస్టారికా అధ్యక్షుడిగా నవలా రచయిత, సంగీతకారుడు కార్లోస్ అల్వరాడో ఎన్నికయ్యారు. ఆయనకు ఎన్నికల్లో 60 శాతానికి పైగా ఓట్లు లభించాయి. కార్లోస్ పాత్రికేయం, రాజనీతి శాస్త్రాల్లో పట్టభద్రుడు.

మార్చి 2018 అంతర్జాతీయం

457 వీసా పథకాన్ని రద్దు చేసిన ఆస్ట్రేలియా :: 
ఆస్ట్రేలియాపభుత్వం విదేశీ నిపుణులకు జారీచేసే 457 వీసా పథకాన్ని రద్దు చేసింది. భారతీయులు ఎక్కువగా లబ్ధిపొందుతున్న ఈ వీసా స్థానంలో కఠిన నిబంధనలతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై ఆస్ట్రేలియా వీసా పొందాలంటే ఇంగ్లిష్‌లో మంచి ప్రావీణ్యం, ఉద్యోగ నైపుణ్యం తప్పనిసరి.
అమెరికా తరహాలోనే ఆస్ట్రేలియా కూడా తమ పౌరులకే తొలి ప్రాధాన్యం ఇచ్చేలా 'ఆస్ట్రేలియా ఫస్ట్' విధానాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా 457 వీసా పథకాన్ని రద్దు చేస్తామని గతేడాదే ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్నబుల్ ప్రకటించారు. ఆ క్రమంలో 457 వీసాని రద్దు చేస్తూ.. దాని స్థానంలో టెంపరరీ స్కిల్ షార్టేజ్ (టీఎస్‌ఎస్) అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. మార్చి 18 నుంచి ఈ కొత్త వీసా విధానం అమల్లోకి వచ్చింది.
విదేశీ ఉద్యోగుల వల్ల స్థానికులకు అవకాశాలు దక్కడం లేదని కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ క్రమంలో తాజా వీసా పథకాన్ని తెరపైకి తెచ్చారు. ఈ పరిణామం భారత్ టెకీలపై ప్రభావం చూపనుంది. 2017 చివరి నాటికి ఈ వీసా కింద ఆ దేశంలో 90,033 మంది ఉంటే వారిలో 21 శాతం మంది భారతీయులే.

చైనాపై వాణిజ్య ఆంక్షలు విధించిన యూఎస్
చైనా దిగుమతులపై 60 బిలియన్ డాలర్ల వార్షిక సుంకాలను విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మార్చి 22న కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. ఏ వస్తువుపై ఎంత పన్ను విధించాలనే విషయాన్ని త్వరలో నిర్ణయిస్తామని తెలిపారు. ట్రంప్ నిర్ణయంతో చైనా నుంచి దిగుమతయ్యే 1300(దాదాపు) వస్తువుల ధరలు పెరగుతాయని ఆర్థికవేత్తల అంచనా. అయితే దీనికి ప్రతిగా చైనా సైతం అమెరికా వస్తువులపై టారిఫ్‌లు పెంచింది.

రష్యాలో అగ్ని ప్రమాదం.. 64 మంది మృతి
తూర్పు రష్యా, సైబీరియా ప్రాంతంలోని ఓ షాపింగ్ మాల్‌లో మార్చి 25న జరిగిన అగ్నిప్రమాదంలో 64 మంది మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. కెమెరొవో పట్టణంలో ఉన్న వింటర్ చెర్రీ అనే షాపింగ్ మాల్‌లో పిల్లల ఆటల కేంద్రాలు, సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు తదితర సౌకర్యాలు ఉంటాయి. వారాంతపు సెలవులకు సరదాగా గడపడానికి వచ్చిన పిల్లలు, తల్లితండ్రులతో షాపింగ్‌మాల్ రద్దీగా తయారైంది. వారంతా సంబరాలు చేసుకుంటుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది.


రష్యా దౌత్యవేత్తల బహిష్కరణ

బ్రిటన్‌లో రష్యా మాజీ గూఢచారిపై జరిగిన రసాయన దాడికి నిరసనగా రష్యా దౌత్యవేత్తలను బహిష్కరిస్తున్నట్లు అమెరికా, కెనడా, ఉక్రెయిన్, ఈయూ(ఐరోపా సమాఖ్య) దేశాలు మార్చి 26న ప్రకటించాయి. ఇదే బాటలో మరికొన్ని దేశాలు సైతం నడవనున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం రష్యా మాజీ గూఢచారి స్క్రిపాల్, ఆయన కుమార్తె యులియాపై విషప్రయోగం (నొవిచోక్-నెర్వ్ ఏజెంట్ ప్రయోగం) జరిగింది. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్క్రిపాల్‌పై దాడి చేసింది రష్యా అధికారులేనని ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే రష్యా మాత్రం వాటిని ఖండించింది.

భూమిపై మిగిలిన ఒకేఒక తెల్లని మగ ఖడ్గమృగం మృతి భూమిపై మిగిలిన ఒకేఒక తెల్లని మగ ఖడ్గమృగం "సుడాన్"కన్నుమూసింది. అనారోగ్యంతో బాధపడుతున్న సూడాన్ చనిపోయిందని కెన్యాలోని ఓఐ పెజెతా కన్జర్వెన్సీ మార్చి 20న తెలిపింది. వయోభారం, కాలికి సోకిన ఇన్ఫెక్షన్ కారణంగానే సూడాన్ మరణించిందని వెల్లడించింది.


చైనా రక్షణమంత్రిగా లెఫ్టినెంట్ జనరల్ వై ఫెంఘే 
ప్రపంచంలో చైనాను మరింత శక్తిమంతంగా నిలిపేలా.. సమర్థవంతంగా, సేవా దృక్పథంతో పనిచేసేలా కొత్త మంత్రి వర్గాన్ని చైనా ప్రధాని లీ కెకియాంగ్ ఏర్పాటు చేశారు. నలుగురు ఉప ప్రధానులతో పాటు 26 మంత్రిత్వ శాఖలు, కమిషన్లతో కూడిన కొత్త కేబినెట్‌కు చైనా పార్లమెంటు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. భారత్ సహా పలు సరిహద్దు దేశాలతో విభేదాల నేపథ్యంలో క్షిపణి రంగ నిపుణుడు లెఫ్టినెంట్ జనరల్ వై ఫెంఘేను రక్షణ శాఖ మంత్రిగా నియమించింది. చైనాలో సైనిక ఆధునికీకరణ, పునర్వ్యవస్థీకరణకు ఆయన కృషి చేశారు.

కూలిన యూన్ వారసత్వ సంపద ఐస్‌బర్గ్
అర్జెంటీనాలో యునెస్కో వారసత్వ సంపదగా భాసిల్లుతున్న ఐస్ బ్రిడ్జి మార్చి 11న కుప్పకూలింది. పెంటగోనియాలోని లాస్ గ్లేసియర్ జాతీయ పార్కులో సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ ఐస్ బ్రిడ్జి.. భారీ తుపాను ధాటికి కూలిపోయింది.

అమెరికాలో ఉక్కు, అల్యూమినియంలపై దిగుమతి సుంకాలుఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఉక్కు, అల్యూమినియంలపై దిగుమతి సుంకాలు విధించారు. ఈ మేరకు చేసిన ప్రతిపాదనలకు మార్చి 9న ఆమోదముద్ర వేశారు. తద్వారా అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాల భయాలకు ఆజ్యం పోశారు. ట్రంప్ ప్రస్తుత నిర్ణయంతో... ఉక్కుపై 25 శాతం, అల్యూమినియంపై 10 శాతం మేర దిగుమతి సుంకాలు 15 రోజుల్లో అమల్లోకి వస్తాయి. అయితే, పొరుగుదేశాలైన మెక్సికో, కెనడాలకు మాత్రం మినహాయింపునిచ్చారు. మిగతా దేశాలు కూడా మినహాయింపులు కావాలనుకుంటే అమెరికా వాణిజ్య శాఖ ప్రతినిధులతో (యూఎస్‌టీఆర్) చర్చల ద్వారా సాధించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ట్రంప్ నిర్ణయంపై అమెరికాలో మిశ్రమ స్పందన వ్యక్తం కాగా.. కీలక వ్యాపార భాగస్వామ్య దేశాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించాయి.


సర్వోన్నత నేత స్థాయికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ 
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఇక జీవితకాలం ఆ పదవిలో కొనసాగేందుకు మార్గం అధికారికంగా సుగమమైంది. ఓ వ్యక్తి అధ్యక్షుడిగా రెండు కంటే ఎక్కువసార్లు పనిచేయకూడదంటూ ఉన్న పరిమితిని ఎత్తివేసే రాజ్యాంగ సవరణకు ఆ దేశ పార్లమెంటు మార్చి 11న ఆమోదం తెలిపింది. ప్రస్తుతం జిన్‌పింగ్ రెండోసారి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఇకపై కూడా ఆయన ఎన్నాళ్లు కోరుకుంటే అన్నాళ్లు, అధ్యక్షుడిగా ఉండొచ్చు. ఇటీవలి దశాబ్దాల్లో చైనాలో అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా జిన్‌పింగ్ ఎదిగారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) స్థాపక చైర్మన్ అయిన మావో జెడాంగ్ తర్వాత అధ్యక్ష పదవిలో జీవితకాలం కొనసాగనున్న నేతగా జిన్‌పింగ్ రికార్డు సృష్టించనున్నారు.


నేపాల్‌లో విమాన ప్రమాదం
నేపాల్ రాజధాని కఠ్మాండూ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. మార్చి 12న యూఎస్-బంగ్లా ఎయిర్‌లైన్స్ కు చెందిన బాంబార్డియర్ డాష్ 8 క్యూ 400 విమానం బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి 67 మంది ప్రయాణికులతో బయల్దేరి.. కఠ్మాండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగుతుండగా సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. విమానం ఒరిగి పక్కనున్న ఫుట్‌బాల్ మైదానంలోకి దూసుకెళ్లింది. మంటలు అంటుకోవడంతో అందులోని ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.
విమానంలో 33 మంది నేపాలీలు ఉండగా.. 32 మంది బంగ్లాదేశీయులు, చైనా, మాల్దీవులకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు.

అమెరికా కొత్త విదేశాంగ మంత్రిగా పాంపియో
అమెరికా విదేశాంగ శాఖ మంత్రిగా సీఐఏ డైరక్టర్ మైక్ పాంపియోను నియమిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. రెక్స్ టిల్లర్సన్‌పై కొంతకాలంగా ఆగ్రహంగా ఉన్న ట్రంప్ టిల్లర్సన్ ఆఫ్రికా పర్యటనలో ఉండగా కొత్త విదేశాంగ మంత్రిని ప్రకటించాడు. ఉత్తర కొరియా, రష్యాల విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలతో పాటు పలు అంశాలపై ట్రంప్, టిల్లర్సన్ మధ్య విభేదాలున్నాయి. పాంపియో నియామకం నేపథ్యంలో ప్రస్తుతం సీఐఏ డిప్యూటీ డెరైక్టర్‌గా ఉన్న జినా హాస్పెల్‌ను సీఐఏ కొత్త డెరైక్టర్‌గా నియమించారు.

చైనా రక్షణ బడ్జెట్ 175 బిలియన్ డాలర్లుభారత్ సహా వివిధ దేశాలతో సరిహద్దు వివాదాలను ఎదుర్కొంటున్న చైనా ఈ ఏడాది తన రక్షణ, సైనిక కార్యకలాపాల కోసం బడ్జెట్‌లో భారీగా నిధులను కేటాయించింది. బడ్జెట్ నివేదికను చైనా ప్రధాన మంత్రి లీ కెఖియాంగ్ ఆ దేశ పార్లమెంటు ఎన్‌పీసీ (నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్)కి సమర్పించారు. 6.5 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును ఈ ఏడాదికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు బడ్జెట్ నివేదికలో చైనా పేర్కొంది. రక్షణ కోసం 175 బిలియన్ డాలర్ల (సుమారు రూ.11.40 లక్షల కోట్లు) నిధులను కేటాయించింది. గతేడాదితో పోలిస్తే ఇది 8.1 శాతం ఎక్కువ. అమెరికా తర్వాత రక్షణ విభాగానికి అత్యధికంగా నిధులు కేటాయిస్తున్న దేశం చైనాయే. భారత్ తన బడ్జెట్‌లో రక్షణ విభాగానికి కేటాయించిన నిధుల (46 బిలియన్ డాలర్లు- దాదాపు రూ.2.99 లక్షల కోట్లు) కన్నా చైనా బడ్జెట్ దాదాపు మూడున్నర రెట్లు ఎక్కువ.

శ్రీలంకలో అత్యవసర పరిస్థితి 
శ్రీలంకలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మత ఘర్షణల నేపథ్యంలో దేశంలో పది రోజుల పాటు ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు అక్కడి సామాజిక సాధికారత శాఖ మంత్రి ఎస్.బి. దిస్సనాయకే మార్చి 6న వెల్లడించారు. శ్రీలంకలోని కాండీ జిల్లాలో బౌద్ధులు, ముస్లింల మధ్య తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయి. పలు మసీదులు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో ఘర్షణలు దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా నిరోధించేందుకు పది రోజుల పాటు అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆధ్వర్యంలోని మంత్రిమండలి ప్రకటించింది.

ఏప్రిల్‌లో కొరియా’ శిఖరాగ్ర భేటీ 
దేశ రక్షణకు పూచీ ఇస్తే అణ్వాయుధాలను త్యజించేందుకు సిద్ధమని ఉత్తరకొరియా తెలిపింది. దీంతోపాటు దక్షిణ కొరియా అధ్యక్షుడితో సమావేశమయ్యేందుకు కూడా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ సంసిద్ధత తెలిపారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ జాతీయ భద్రతా సలహాదారు చుంగ్-ఇయు-యాంగ్ నేతృత్వంలో ప్రతినిధి బృందం ఇటీవల ఉత్తర కొరియా వెళ్లింది. రాజధాని ప్యాంగ్‌యాంగ్‌లో ఆ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో ఈ బృందం సమావేశమైంది. మార్చి 6న తిరిగి స్వదేశానికి చేరుకున్న ఈ బృందం చర్చల ఫలితాలను వెల్లడించింది. ఉత్తర కొరియాతో చర్చల్లో గణనీయ పురోగతి కనిపించిందని పేర్కొంది. సరిహద్దు గ్రామం పన్‌మున్‌జోంలో ఏప్రిల్‌లో రెండు దేశాల అధ్యక్షుల సమావేశానికి అంగీకారం కుదిరిందని తెలిపింది. తమపై సైనిక పరమైన ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా చేసి, ప్రభుత్వ మనుగడకు గ్యారెంటీ ఇచ్చిన పక్షంలో అణ్వాయుధాలను, క్షిపణులను కలిగి ఉండటంలో అర్థం లేదని, వాటిని త్యజిస్తామని ఉత్తరకొరియా పాలకుడు చెప్పినట్లు యాంగ్ వెల్లడించారు. తాము ఎలాంటి అణు, మిస్సైల్ పరీక్షలు జరుపబోమని ఉత్తరకొరియా హామీ ఇచ్చిందన్నారు.

మహిళా దినోత్సవ ఇతివృత్తం - ప్రెస్ ఫర్ ప్రోగ్రెస్’ 
2018 మహిళా దినోత్సవం(మార్చి 8) ఇతివృత్తంగా ‘ప్రెస్ ఫర్ ప్రోగ్రెస్’ (ప్రగతి కోసం పట్టుబట్టండి) నినాదాన్ని ఐక్యరాజ్య సమితి ఖరారు చేసింది. గత కొన్నేళ్లుగా స్త్రీలు అనేక రంగాల్లో పరుషులతో సమానంగా రాణిస్తున్నప్పటికీ ఇంకా ఆడ-మగ తారతమ్యాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధానంగా ప్రస్తావించి పురుషులతో సమానంగా హక్కులు సాధించే లక్ష్యంతో ఈ నినాదాన్ని ఎంపిక చేశారు. 1975లో ఐక్యరాజ్య సమితి మార్చి 8ని మహిళా దినోత్సవంగా ప్రకటించింది. అయితే దీనికి ఎన్నో ఏళ్ల ముందు నుంచి కూడా అనేక దేశాల్లో మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. తొలిసారిగా అమెరికాలో 1909లో ఫిబ్రవరి 28ని మహిళా దినోత్సవంగా పాటించారు.


మహిళా సాధికారత కోసం గేట్స్ ఫౌండేషన్ భారీ విరాళం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బిల్‌గేట్స్ దంపతులు భారీ విరాళాన్ని ప్రకటించారు. మహిళలు ఆర్థిక సాధికారిత సాధించడమే లక్ష్యంగా భారత్ సహా నాలుగు దేశాలకు 170 మిలియన్ డాలర్ల(అంటే వెయి్యకోట్లకు పైమాటే) ప్రాజెక్ట్‌ను బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ ప్రకటించింది. ఇండియా, కెన్యా, టాంజానియా, ఉగాండా దేశాల్లో లింగ సమానత్వాన్ని పెంచడం, డిజిటల్ ఆర్థిక సమ్మేళనాన్ని విస్తరించడం, ఉద్యోగ అవకాశాలు పెంచడం, వ్యవసాయ రంగానికి, మహిళా బృందాలకు మద్దతునివ్వడం వంటి వాటికోసం ఈ నిధులను ఖర్చుచేస్తారు. 

ఫిబ్రవరి 2018 అంతర్జాతీయం

జిన్‌పింగ్ కోసం రాజ్యాంగ సవరణ 
చైనాలో శక్తిమంతమైన నేతగా గుర్తింపు పొందిన జిన్‌పింగ్ చైనా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికయ్యేందుకు పావులు కదుపుతున్నారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల్ని ఏ వ్యక్తులైనా రెండుసార్లకు మించి చేపట్టకూడదనే రాజ్యాంగ నిబంధనను తొలగించేందుకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ(సీపీసీ) సిద్ధమైంది. సీపీసీకి చెందిన సెంట్రల్ కమిటీ ఈ నిబంధనను రాజ్యాంగం నుంచి తొలగించాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం చైనా అధ్యక్షుడిగా ఉన్న జిన్‌పింగ్ పదవీకాలం 2022తో ముగియనుంది. తాజా నిర్ణయం వల్ల జిన్‌పింగ్ చైనా అధ్యక్షుడిగా ఎన్నిసార్లయినా పోటీ చేయవచ్చు. గతేడాది జరిగిన సీపీసీ కాంగ్రెస్ సమావేశాల్లో జిన్‌పింగ్ సిద్ధాంతాల్ని, ఆలోచనా విధానాన్ని రాజ్యాంగంలో చేర్చాలని నిర్ణయం తీసుకుంది. 

డ్రైవర్‌లెస్ కార్లకు కాలిఫోర్నియా అనుమతి 
అమెరికాలోని కాలిఫోర్నియా నగరం డ్రైవర్ రహిత కార్లను నగర రోడ్లపై పరీక్షించేందుకు అనుమతిని ఇచ్చింది. ఇందుకు సంబంధించి వాహన నియమావళిని కూడా సవరించింది. ప్రస్తుతం డ్రైవర్ రహిత కార్లను రోడ్లపైకి తెచ్చేందుకు టెల్సా, వైమో సంస్థలు పోటీ పడుతున్నాయి. కాగా ఇప్పటిదాకా వీటిని పరీక్షించేందుకు అనుమతి ఇచ్చినప్పటికీ ముందు జాగ్రత్తగా డ్రైవర్‌ను అందుబాటులో ఉంచి, పరీక్షించారు. తొలిసారి పూర్తిగా వాహనంలో ఎవరూ లేకుండానే పరీక్షించేందుకు కాలిఫోర్నియా స్టేట్ గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది. 


సౌదీ సైన్యంలోకి మహిళలు
సౌదీఅరేబియా మహిళలను సైన్యంలోకి అనుమతిస్తూ ఫిబ్రవరి 26న చారిత్రక ప్రకటన చేసింది. మహిళా సాధికారతను పెంపొందించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. 

దక్షిణాఫ్రికా నూతన అధ్యక్షుడిగా సిరిల్ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. దీంతో 9 ఏళ్ల జుమా పాలనకు తెరపడింది. అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్‌సీ), జుమాకు మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనకు తెరపడింది. ఆయన రాజీనామా చేయకపోతే ప్రతిపక్ష పార్టీలతో కలసి పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టి జుమాను గద్దె దించాలని అధికార పార్టీ భావించింది. జాకబ్ జుమా రాజీనామా నేపథ్యంలో దక్షిణాఫ్రికా నూతన అధ్యక్షుడిగా ప్రస్తుత ఉపాధ్యక్షుడు సిరిల్ రామాఫోసా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 15న జరిగిన పార్లమెంటు సమావేశంలో ఆయన ఎన్నికైనట్లు ప్రకటన వెలువడింది. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా 65 ఏళ్ల రామాఫోసా రెండు నెలల కిందటే ఎన్నికయ్యారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : దక్షిణాఫ్రికా నూతన అధ్యక్షుడిగా రామాఫోసా 
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎందుకు : జాకబ్ జుమా పదవికి రాజీనామా చేసినందున 

నేపాల్ ప్రధానిగా ఓలీ ప్రమాణ స్వీకారం 
హిమాలయ దేశమైన నేపాల్‌కు 41వ ప్రధానిగా ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ ఫిబ్రవరి 15న ప్రమాణ స్వీకారం చేశారు. మహరాజ్‌గంజ్‌లోని శీతల్ నివాస్‌లో అధ్యక్షురాలు బిద్యా దేవీ.. ఓలీ చేత ప్రమాణం చేయించారు. ఓలీ ఇంతకుముందు 2015 అక్టోబర్ నుంచి 2016, ఆగస్టు 3 వరకూ నేపాల్ ప్రధానిగా పనిచేశారు. ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో ఓలీకి చెందిన సీపీఎన్-యూఎంఎల్, ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్-మావోయిస్ట్ సెంటర్ 174 సీట్లు గెలిచింది.


యూనిసెఫ్ ఎవ్రీ చైల్డ్ అలైవ్’ నివేదిక 
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 10 లక్షల మంది చిన్నారులు పుట్టినవెంటనే చనిపోతున్నారని యూనిసెఫ్ తెలిపింది. నెల రోజుల్లోపు వయసున్న చిన్నారులు ప్రతి ఏటా 26 లక్షల మంది కన్నుమూస్తున్నారని వెల్లడించింది. ఈ మేరకు ‘ఎవ్రీ చైల్డ్ అలైవ్’ పేరుతో చేపట్టిన ప్రచార కార్యక్రమానికి అనుబంధంగా 184 దేశాల్లో చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించి యూనిసెఫ్ నివేదికను ఫిబ్రవరి 20న విడుదల చేసింది. అభివృద్ధి చెందిన ధనిక దేశాలతో పోల్చుకుంటే పేద దేశాల్లో పుట్టే చిన్నారులు చనిపోయే అవకాశం 50 రెట్లు ఎక్కువని పేర్కొంది. ఈ మరణాలన్నీ మెరుగైన వైద్యంతో నివారించదగ్గవేనని యూనిసెఫ్ తెలిపింది. 
నవజాత శిశువుల మరణాల్లో పాకిస్తాన్ తొలిస్థానంలో నిలిచిందనీ, అక్కడ పుట్టిన ప్రతి 22 మంది శిశువుల్లో ఒకరు చనిపోతున్నారని యూనిసెఫ్ తెలిపింది. శిశు మరణాలకు సంబంధించి 52 దిగువ మధ్యతరగతి దేశాల్లో భారత్ 12వ స్థానంలో నిలిచినట్లు యూనిసెఫ్ తెలిపింది. నవజాత శిశువుల మరణాలు జపాన్‌లో(ప్రతి 1,111 మందిలో ఒకరు) అత్యల్పంగా నమోదైనట్లు పేర్కొంది.

భారత్‌లో ఏటా 6 లక్షల మంది మృతి
భారత్‌లో పుట్టే చిన్నారుల్లో 6 లక్షల మందికిపైగా నెలరోజుల్లోపే కన్నుమూస్తున్నారని యూనిసెఫ్ తెలిపింది. ఇలా చనిపోతున్నవారిలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారంది. కేరళ, గోవా రాష్ట్రాల్లో పుట్టిన ప్రతి 1000 మంది చిన్నారుల్లో 10 మంది నెల రోజుల్లోపే చనిపోతుండగా, ఉత్తరాఖండ్, బిహార్‌లో ఇది 44గా ఉందని తెలిపింది. దేశవ్యాప్తంగా మొత్తం జననాల్లో ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల వాటా 46 శాతంగా ఉందంది. అలాగే దేశవ్యాప్తంగా నెలరోజుల్లోపు చనిపోతున్న శిశువుల్లో ఈ రాష్ట్రాల్లోనే 57 శాతం మంది ఉన్నారని వెల్లడించింది. 2030 నాటికి నెల రోజుల్లోపు శిశు మరణాల రేటును ప్రతి వెయి్యమందికి 12కు తగ్గించాలన్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని భారత్ అందుకోలేదని నివేదిక స్పష్టం చేసింది. అయితే ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలను ప్రతి వెయి్యమందికి 25కు తగ్గించడంలో భాగంగా భారత్ మంచి పురోగతి సాధించిందని పేర్కొంది. ఈ జాబితాలో భారత్(31వ ర్యాంక్)తో పోల్చుకుంటే నేపాల్(50), బంగ్లాదేశ్(54 ), భూటాన్(60), శ్రీలంక(127) మెరుగైన ర్యాంకులు సాధించాయని తెలిపింది. 

ఇజ్రాయెల్ ప్రధానిపై విచారణకు సిఫారసు
అవినీతి ఆరోపణలకు సంబంధించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై రెండు కేసుల్లో నేరాభియోగాలు నమోదుకు ఆ దేశ పోలీసులు ిసిఫారసు చేశారు. 14 నెలల దర్యాప్తు అనంతరం నెతన్యాహుకు వ్యతిరేకంగా తగిన ఆధారాలు లభించాయని ప్రకటించిన పోలీసులు.. ప్రభుత్వ విచారణకు సిఫారసు చేశారు. అనుకూలంగా పనులు చేసి పెట్టేందుకు కానుకలు స్వీకరించడం; మీడియా కవరేజ్ కోసం ఒక ప్రముఖ వార్తా ప్రతిక ప్రచురణకర్తతో తెరవెనుక లావాదేవీలు జరపడం వంటివి పోలీసుల ప్రధాన ఆరోపణలు. నెతన్యాహు గత పదేళ్ల కాలంలో దాదాపు 3 లక్షల డాలర్లు స్వీకరించారని పోలీసులు ఆరోపించారు.

న్యూజిలాండ్‌లో ఒంటరి పక్షి నెగైల్ మృతి ప్రపంచంలోనే ఒంటరి పక్షిగా పేరుగాంచిన సముద్ర పక్షి(గనెట్ జాతి పక్షి) నెగైల్ మృతి చెందింది. గత కొన్నేళ్లుగా న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్ తీరంలోని ‘మనా’ ద్వీపంలో కృత్రిమంగా ఏర్పాటు చేసిన కాలనీలో ఈ నెగైల్ ఒంటరిగా జీవిస్తుండేది. దీంతో ఇది ప్రపంచవ్యాప్తంగా ఒంటరి పక్షిగా గుర్తింపు పొందింది. ఇది గమనించిన జంతు పరిరక్షకులు దానికి కావాల్సిన ఏర్పాట్లను చేయడంతో అది అక్కడే జీవించేది. సాధారణంగా గనెట్ పక్షులు సమూహాలుగా నివసిస్తాయి. కానీ నెగైల్ ఏనాడూ ద్వీపాన్ని వదిలిపెట్టలేదు. ఇన్నేళ్లు ఒంటరిగా నివసించిన నెగైల్ వయసు మీదపడి చనిపోయి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 
 

క్రిప్టో సంపన్నుడు క్రిస్ లారెన్స్ 
ఫోర్బ్స్ తాజాగా తొలి క్రిప్టో కరెన్సీ సంపన్నుల జాబితాను విడుదల చేసింది. ఇందులో రిపిల్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ లార్సెన్ అగ్రస్థానంలో నిలిచారు. ఈయన క్రిప్టో నికర విలువ 7.5-8 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంచనా. ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. 2017లో బిట్‌కాయిన్, ఇథీరియమ్, ఎక్స్‌ఆర్‌పీ అనే మూడు ప్రముఖ క్రిప్టోకరెన్సీల సగటు విలువలో మార్పు 14,409 శాతంగా ఉంది. దాదాపు 1,500 క్రిప్టో కరెన్సీలున్నాయి. వీటి సమష్టి విలువ 550 బిలియన్ డాలర్లు. 2017 ప్రారంభం నుంచి చూస్తే ఈ కరెన్సీల విలువ 31 శాతం మేర ఎగసింది. జోసెఫ్ లుబిన్ (క్రిప్టో నికర విలువ: 1-5 బిలియన్ డాలర్లు), చాంగ్‌పెంగ్ ఝావో (1-1.2 బిలియన్ డాలర్లు), కామెరాన్ అండ్ టైలెర్ వింక్‌లెవోస్ (900 మిలియన్- 1.1 బిలియన్ డాలర్లు), మాథ్యూ మెలాన్ (900 మిలియన్-1.1 బిలియన్ డాలర్లు) తదితరులు ఈ జాబితాలో స్థానం పొందారు. 
2018 జనవరి 19 నాటి క్రిప్టో కరెన్సీల విలువ ఆధారంగా ఈ సంపన్నుల జాబితాలను రూపొందించారు. ఇందులో స్థానం దక్కించుకోవాలంటే కనీసం 350 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీలను కలిగి ఉండాలి. భారత్‌లో క్రిప్టో కరెన్సీలకు చట్టబద్ధత లేదు. 
 

రష్యా విమాన ప్రమాదంలో 71 మంది మృతి
రష్యాలో ఫిబ్రవరి 11న జరిగిన విమాన ప్రమాదంలో 71 మంది దుర్మరణం చెందారు. మాస్కోలోని డొమొడెడొవో విమానాశ్రయం నుంచి ఉరల్ పర్వతశ్రేణుల్లోని ఓర్క్స్ పట్టణానికి బయలుదేరిన సరతోవ్ ఎయిర్‌లైన్‌‌సకు చెందిన ఆంటొనోవ్ ఏఎన్-148 జెట్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూప్పకూలిపోయింది. దీంతో అందులోని ఆరుగురు సిబ్బందితో సహా 65 మంది ప్రయాణికులు మృతి చెందారు.

దక్షిణ కొరియాపై కిమ్ ప్రశంసల వర్షం 
దక్షిణకొరియా అంటే భగ్గున మండిపడే ఉత్తర కొరియా నేత కిమ్ దక్షిణకొరియా వైఖరి బాగా నచ్చిందని మెచ్చుకోవడంతో పాటు ఆ దేశానికి కృతజ్ఞతలు తెలిపారు. దక్షణకొరియా ప్యాంగ్‌చాంగ్‌లో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌కు వెళ్లి వచ్చిన తన సోదరి, ఇతర ప్రతినిధుల బృందం ఫిబ్రవరి 12న రాజధాని ప్యాంగ్‌యాంగ్‌లో కిమ్‌ను కలుసుకుంది. వారితో చర్చల అనంతరం అధికార మీడియా ఈ మేరకు ఒక కథనాన్ని ప్రచురించింది. తమదేశ ప్రతినిధి బృందం దక్షిణ కొరియా పర్యటనపై అధ్యక్షుడు కిమ్ సంతృప్తి వ్యక్తం చేశారని, పర్యటనకు అత్యంత ప్రాముఖ్యం ఇచ్చిన ఆ దేశ వైఖరి కిమ్‌కు నచ్చిందని పేర్కొంది. సియోల్ నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారని వెల్లడించింది. 

జాకబ్ జుమా రీకాల్‌కు ఏఎన్‌సీ నిర్ణయం
దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాను రీకాల్ చేయాలని అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్(ఏఎన్‌సీ) నిర్ణయించింది. అవినీతి ఆరోపణలతో నిండా మునిగిన జుమా రాజీనామాకు నిరాకరించటంతో ఫిబ్రవరి 12న ఏఎన్‌సీ అత్యున్నత స్థాయి భేటీ జరిపింది. దాదాపు 13 గంటల సుదీర్ఘ చర్చల తర్వాత జుమాను సాగనంపాలని తీర్మానించింది. అయితే, ఇందుకు గడువేదీ విధించలేదు. ఈ మేరకు జుమాకు ఏఎన్‌సీ లేఖ రాయనున్నట్లు సమాచారం. రాజీనామాకు అంగీకరించిన జుమా 6 నెలలు కొనసాగాలని భావిస్తున్నట్లు ఏఎన్‌సీ ప్రధాన కార్యదర్శి మగషులే తెలిపారు. భారీ అవినీతి, దేశ ఆర్థిక మందగమనం, రికార్డు స్థాయిలో పెరిగిన నిరుద్యోగం కారణాలతో జుమాపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. 

పాక్ నిషేధిత జాబితాలో సయీద్ సంస్థలు
అంతర్జాతీయ ఆంక్షల్ని తప్పించుకునే ఉద్దేశ్యంతో పాకిస్తాన్ ఉగ్రవాద వ్యతిరేక చట్టాల్లో సవరణలు చేసింది. ముంబై పేలుళ్ల సూత్రధారి, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జమాత్-ఉద్-దవా, ఫలాహ్-ఐ-ఇన్సానియత్ ఫౌండేషన్‌తో పాటు పలు సంస్థల్ని ఉగ్రవాద జాబితాలో చేర్చుతూ పాక్ అధ్యక్షుడు ఆర్డినెన్‌‌స జారీ చేశారు. ఐరాస నిషేధిత జాబితాలో ఉన్న ఉగ్ర సంస్థలూ ఇందులో ఉన్నాయి. 
ఉగ్రవాదానికి పాక్ అనుకూలమన్న ముద్రను చెరిపేసుకునే ప్రయత్నంలో భాగంగా పారిస్‌లో ఫిబ్రవరి 18 నుంచి జరగనున్న ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్‌ఏటీఎఫ్) సమావేశాన్ని దృష్టిలో పెట్టుకుని హడావుడిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మనీ ల్యాండరింగ్, ఉగ్రవాదులకు ఆర్థిక సాయాన్ని ఎఫ్‌ఏటీఎఫ్ నియంత్రిస్తోంది. ఉగ్రవాదులకు అండగా ఉన్న పాక్‌ను ‘ఎఫ్‌ఏటీఎఫ్’ గ్రే జాబితాలో చేర్చేందుకు అమెరికా, భారత్‌ల ప్రయత్నాల నేపథ్యంలో ఈ ఆర్డినెన్‌‌స జారీచేశారు. గతంలో 2012 నుంచి మూడేళ్ల పాటు పాక్ ‘ఎఫ్‌ఏటీఎఫ్’ గ్రే జాబితాలో కొనసాగింది.

అఫ్గానిస్తాన్‌లో చైనా మిలటరీ బేస్ ఏర్పాటు అఫ్గానిస్తాన్‌లో మిలటరీ బేస్ నిర్మించేందుకు చైనా ఆ దేశంతో చర్చలు జరుపుతోందని అఫ్గానిస్తాన్ అధికారులు తెలిపారు. పర్వతాలతో కూడిన వాఖన్ కారిడార్ నుంచి తమ సరిహద్దు ప్రాంతం జిన్‌జియాంగ్‌లోకి ఉగ్రవాదులు ప్రవేశిస్తున్నారని ఆందోళన చెందుతున్న చైనా..అక్కడ మిలటరీ బేస్ నిర్మించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.


మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం
జైళ్లలో ఉన్న ప్రతిపక్ష నేతల శిక్షల్ని రద్దు చేస్తూ ఆ దేశ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మాల్దీవుల్లో మరోసారి రాజకీయ అనిశ్చితి తలెత్తింది. జైలు శిక్ష ఎదుర్కొంటోన్న మాజీ అధ్యక్షుడు నషీద్ ప్రవాసంలో ఉండగా.. జైళ్లలో ఉన్న మిగిలిన రాజకీయ నేతల్ని విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. వివాదాస్పదమైన 2013 అధ్యక్ష ఎన్నికల్లో నషీద్‌పై విజయం సాధించాక యమీన్ అధికారంలోకి వచ్చారు. అనంతరం స్వపక్షంలోని అసంతృప్త నేతలు, ప్రతిపక్ష నేతలను యమీన్ జైల్లో పెట్టించారు.


అణు’ ఆధునీకరణకు అమెరికా కొత్త విధానం 
అణ్వస్త్రాలను ఆధునీకరించేందుకు, చిన్నస్థాయి అణ్వాయుధాల తయారీకి వీలుగా అమెరికా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. 100 పేజీలతో న్యూక్లియర్ పోస్టర్ రివ్యూ(ఎన్‌పీఆర్)-2018 పేరిట తీసుకొచ్చిన ఈ విధానం ద్వారా అమెరికా, దాని మిత్రదేశాలపై జరిగే అణు దాడుల్ని నిరోధించవచ్చని ట్రంప్ యంత్రాంగం తెలిపింది. ఈ విధానంపై పెంటగాన్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. ‘21వ శతాబ్దంలో అమెరికాకు ఎదురవుతున్న అనేక రకాల ప్రమాదాలను ఎదుర్కోవడానికి ఈ విధానం చాలా అనువైనదని పేర్కొన్నారు. అణ్వాయుధ కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్ విభాగాలతో పాటు సంప్రదాయ, అణ్వాయుధాలు ప్రయోగించే విమానాలు, భూ,సముద్ర, వాయు మార్గాల నుంచి దాడిచేసే సామర్థ్యం ఆధునీకరణకు ఈ విధానం దోహదం చేస్తుందని తెలిపారు. అన్నింటికంటే ముఖ్యంగా ఈ విధానం అణువ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పీటీ), అణ్వాయుధాల నియంత్రణతో పాటు అణు పరీక్షల నిషేధంపై అమెరికా నిబద్ధతను పునరుద్ఘాటిస్తోంది అని వెల్లడించారు. 


మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం-కారణాలు 
దక్షిణ ఆసియాలోని మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం ముదిరింది. ఆ దేశ ప్రభుత్వం ఫిబ్రవరి 5న పార్లమెంట్‌ను సస్పెండ్ చేసి 15 రోజుల పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. కొన్ని గంటల వ్యవధిలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్లా సయీద్‌తో పాటు మరో న్యాయమూర్తిని అరెస్టు చేయించింది. మాజీ అధ్యక్షుడు మౌమూన్ అబ్దుల్ గయూమ్ కూడా నిర్బంధంలో ఉన్నారు.

సంక్షోభానికి కారణం..
వివిధ కేసుల్లో మాజీ అధ్యక్షుడు మొహమద్ నషీద్ సహా పలువురు రాజకీయ నాయకులపై జరుగుతున్న విచారణ చెల్లదని సుప్రీంకోర్టు 2018 జనవరిలో ప్రకటించింది. నిర్బంధంలో ఉన్న 9 మంది ప్రతిపక్ష ఎంపీల విడుదలకు ఆదేశాలు ఇచ్చింది. మొహమద్ నషీద్‌పై 2015లో చేపట్టిన విచారణ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మాల్ద్దీవుల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తొలి అధ్యక్షుడుగా గుర్తింపు పొందిన నషీద్ ప్రస్తుతం ప్రవాసంలో ఉన్నారు. 
అయితే.. తన రాజకీయ ప్రత్యర్థులను కోర్టు ఆదేశాలకు అనుగుణంగా విడుదల చేయడానికి ప్రస్తుత అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ నిరాకరించడంతో మాల్దీవుల్లో సంక్షోభం తలెత్తింది. ప్రతిపక్ష నేతలకు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేపట్టారు. 
భారత్ సహాయాన్ని కోరిన నషీద్..
తమ దేశంలో రాజకీయ సంక్షోభానికి తెరదించేందుకు భారత్ తన సైన్యాన్ని పంపించి సాయం చేయాలని మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ కోరారు. మాల్దీవుల్లో అత్యవసర స్థితిని ప్రకటించడం సైనిక పాలనను ప్రవేశపెట్టడం వంటిదేనని.. ఇది రాజ్యాంగవిరుద్ధం, అక్రమమని ఆయన పేర్కొన్నారు. కాగా, మాల్దీవుల్లో అత్యవసర పరిస్థితి విధించడంతో తాము కలత చెందామని భారత్ పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తిని అరెస్టు చేయించడం ఆందోళనకరమంది. మాల్దీవులకు సాయం చేసే విషయంలో భారత్ నిర్దిష్ట కార్యాచరణ విధానాన్ని అనుసరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 
మాల్దీవుల్లో సంక్షోభంతో భారత్, చైనాపై ప్రభావం 
హిందూ మహా సముద్ర ద్వీప దేశం మాల్దీవుల్లో నెలకొన్న తీవ్ర సంక్షోభం ఇండియాను కలవరపెడుతోంది. ఇటీవలే మాల్దీవులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్న మరో ఆసియా దిగ్గజం చైనా కూడా తన వ్యూహాత్మక ప్రయోజనాల దృష్ట్యా తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. భారత నౌకా రవాణాకు అత్యంత కీలకమైన హిందూ మహాసముద్ర ప్రాంతంలోని మాల్దీవులతో 2011 వరకు భారత్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే 2012లో నాటి అధ్యక్షుడు నషీద్ ప్రభుత్వాన్ని పోలీసు, సైనిక తిరుగుబాటులో కూల్చివేసి అబ్దుల్లా యమీన్ అధ్యక్షుడయ్యాక మాల్దీవుల్లో చైనా పలుకుబడి, వ్యాపారం విపరీతంగా పెరిగాయి. రాజధాని మాలేలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆధునీకరించడానికి భారత కంపెనీ జీఎంఆర్‌కు ఇచ్చిన కాంట్రాక్టును కూడా యమీన్ సర్కారు రద్దు చేసింది.

మాల్దీవుల్లో 22 వేల మంది భారతీయులు
లక్ష దీవులకు 700 కి.మీ. దూరంలోని ఈ చిన్న దేశం జనాభా నాలుగున్నర లక్షలు. ప్రస్తుతం 22 వేల మంది భారతీయులు ఇక్కడ పనిచేస్తున్నారు. దేశంలోని మొత్తం 400 మంది వైద్యుల్లో 125 మందికి పైగా భారతీయులే. ఉపాధ్యాయుల్లో నాలుగో వంతు మంది కూడా ఇండియా నుంచి వెళ్లినవారే. దాదాపు అందరూ ముస్లింలే ఉన్న మాల్దీవుల్లో సంక్షోభం ముదిరితే అక్కడ మత ఛాందస వాదం, వాణిజ్య నౌకల దోపిడీ, స్మగ్లింగ్, మాదకద్రవ్యాల రవాణా పెరిగి తన భద్రతకు ముప్పువాటిల్లుతుందని భారత్ ఆందోళన చెందుతోంది. భారత సరుకు రవాణా 97 శాతం ఈ ప్రాంతం మీదుగానే జరుగుతోంది. 1988లో మాల్దీవులను తమ అధీనంలోకి తెచ్చుకోవడానికి శ్రీలంక తీవ్రవాదుల ముఠా యత్నించినా భారత సైన్యం అండతో నాటి అధ్యక్షుడు గయూమ్ ఆ చర్యను తిప్పికొట్టారు.

2011లో చైనా పాదం
మాల్దీవుల్లో చైనా రాయబార కార్యాలయాన్ని 2011లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఈ ద్వీపదేశంతో చైనా వాణిజ్య సంబంధాలు వేగంగా వృద్ధి చెందాయి. సార్క్ దేశాల్లో పాకిస్తాన్ తర్వాత చైనాతో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం చేసుకున్న రెండో దేశం మాల్దీవులు. పార్లమెంటులో ఎలాంటి చర్చ లేకుండానే ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. చైనా చేపడుతున్న ఓబీఓఆర్ ప్రాజెక్టులో మాల్దీవులు కూడా భాగస్వామి. మాలే-హుల్‌హూల్ ద్వీపాల మధ్య వంతెన సహా అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చైనా సహాయంతో ఇక్కడ నిర్మిస్తున్నారు. హిందూ మహాసముద్రంలో సముద్ర సిల్క్ రూట్ ప్రాజెక్టు నిర్మాణంలో మాల్దీవులది కీలకపాత్రగా చైనా భావిస్తోంది. శ్రీలంకలో హంబన్‌టోటా రేవు ప్రాజెక్టుతోపాటు జిబూటీలోనూ సైనిక స్థావరం నిర్మాణానికి స్థలం సంపాదించిన చైనా చెప్పుచేతల్లో నడిచే రాజ్యంగా మాల్దీవులు మారడం భారత్‌కు ఆందోళన కలిగించే అంశమే. 

శరణార్థులపై నిషేధం ఎత్తేసిన యూఎస్ 
11 దేశాల శరణార్థులపై విధించిన నిషేధాన్ని ఎత్తేస్తున్నట్లు అమెరికా జనవరి 30న ప్రకటించింది. అయితే ఆయా దేశాల నుంచి వచ్చే శరణార్థులు కఠిన తనిఖీలు ఎదుర్కోవలసి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ జాబితాలో ఇరాన్, లిబియా, ఈజిప్ట్, మాలి, సోమాలియా, దక్షిణ సూడాన్, సూడాన్, సిరియా, యెమెన్, ఉత్తర కొరియా ఉన్నాయి.

Sunday, 11 February 2018

జనవరి 2018 అంతర్జాతీయం

‘పుతిన్ లిస్టు’ విడుదల చేసిన అమెరికా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారని ఆరోపిస్తూ రష్యాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల పేర్లతో అమెరికా ‘పుతిన్ లిస్టు’ను విడుదల చేసింది. అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నందుకు రష్యాను శిక్షించాలని అమెరికన్ కాంగ్రెస్ చేసిన చట్టం అమల్లో భాగంగా జనవరి 30న అమెరికా ఆర్థిక శాఖ ఈ జాబితాను విడుదల చేసింది.
రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న పుతిన్ పరిపాలన యంత్రాంగంలోని అందరి పేర్లతో పాటు కేబినెట్ మంత్రుల్ని, ఆ దేశానికి చెందిన ప్రముఖ బిలియనీర్లను ఇందులో చేర్చింది. జాబితాలోని 114 మంది రాజకీయ నాయకుల్లో పుతిన్ సహాయకులు, కేబినెట్ మంత్రుల పేర్లు ఉండగా.. 96 మంది బిలియనీర్లలో వివాదరహితులుగా పేరొందిన పలువురు వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. రష్యా ప్రధాని దిమిత్రి మెద్వెదెవ్, విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్, నిఘా విభాగాలైన ఎఫ్‌ఎస్‌బీ, జీఆర్‌యూలకు చెందిన ఉన్నతాధికారులు కూడా ఇందులో ఉన్నారు

140 ఏళ్లు బతికే అవకాశం
ఆరోగ్య రంగంలో వస్తోన్న ఆధునిక సాంకేతిక మార్పుల కారణంగా మనిషి ఆయుర్దాయం140 ఏళ్లకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో భాగంగా జనవరి 24న దావోస్‌లో ‘ఆరోగ్య రంగాన్ని మారుస్తున్న నాలుగో తరం పారిశ్రామిక విప్లవం’ పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న నిపుణులు రాబోయే కొన్ని దశాబ్దాల్లో మనిషి ఆయుర్దాయం పెరగనుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

చైనాలో స్పై విమానంసముద్రాల్లో విమాన వాహక నౌకల నుంచి నియంత్రించగలిగే కొత్త గూఢచర్య విమానాన్ని చైనా అభివృద్ధి చేస్తోంది. శత్రు దేశాల డ్రోన్లు, జెట్‌ల కదలికలను కనిపెట్టడానికి వీలుగా దీనికి ఏఈఎస్‌ఏ రాడార్‌ను అమర్చారు. కేజే-600 అనే పేరుగల ఈ గూఢచర్య విమానాన్ని చైనా అభివృద్ధిపరుస్తున్నట్లు ఆ దేశ అధికారిక మీడియా జనవరి 28న తొలిసారిగా బయటపెట్టిందంటూ హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. చైనా సముద్ర జలాల్లో ఇప్పటికే రెండు విమాన వాహక నౌకలు సేవలందిస్తుండగా, మూడో దానిని షాంఘైలో నిర్మిస్తోంది. తాజాగా అభివృద్ధి చేస్తున్న గూఢచర్య విమానాలను మూడో విమాన వాహక నౌకపై మోహరించే అవకాశం ఉన్నట్లు పత్రిక పేర్కొంది. 

పదవిలో ఉండగా తల్లి కాబోతున్న న్యూజిలాండ్ ప్రధాని ప్రధాని పదవిలో ఉండగా ఓ బిడ్డకు జన్మనిచ్చిన నేతల జాబితాలో న్యూజిలాండ్ పధానిజసిందా అర్డెన్ (37) చేరనున్నారు. 2017 అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో గెలిచి ప్రధాని బాధ్యతలు చేపట్టిన అర్డెన్ ‘ఈ ఏడాది జూన్‌లో నేను బిడ్డకు జన్మనివ్వబోతున్నా’ అని జనవరి 19న ప్రకటించారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్, పాక్ దివంగత ప్రధాని బెనజీర్ భుట్టో కూడా పదవిలో ఉండగానే సంతానం పొందారు. 

వినిమయ బిల్లును తిరస్కరించిన అమెరికా సెనెట్అమెరికా పాలనా యంత్రాంగ నిర్వహణకు అవసరమైన ఖర్చులను నిర్దేశించే ‘వినిమయ బిల్లు’ను సెనెట్ తిరస్కరించటంతో అమెరికా ప్రభుత్వం అధికారికంగా మూతపడింది. ఫిబ్రవరి 16 వరకు ప్రభుత్వ నిర్వహణకు అవసరమైన నిధులు ఇచ్చే ఈ బిల్లు జనవరి 19న సెనేట్‌లో 50-48 తేడాతో వీగిపోయింది. దీంతో పెంటగాన్, ఇతర కేంద్ర సంస్థలు పనిచేసేందుకు అవసరమైన నిధులు తాత్కాలికంగా ఆగిపోతాయి. దాదాపు 8 లక్షల మంది ప్రభుత్వోద్యోగులు వేతనాల్లేకుండానే సెలవులో ఉంటారు. వైద్యం, పోలీసు వంటి అత్యవసర సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయి. గతంలో 2013 అక్టోబర్‌లో 16 రోజులు, 1996లో 21 రోజుల పాటు షట్‌డౌన్ కొనసాగింది.


అమెరికాలో షట్‌డౌన్‌కు ముగింపు చర్చలు సఫలంమూడ్రోజులపాటు అమెరికాను స్తంభింపజేసిన షట్‌డౌన్‌కు ముగింపు పలికే దిశగా అధికార రిపబ్లికన్లు, ప్రతిపక్ష డెమొక్రాట్ కాంగ్రెస్ సభ్యుల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. జనవరి 22న జరిగిన ఈ చర్చల్లో డెమొక్రాట్ల ‘స్వాప్నికుల’ డిమాండ్‌పై చర్చకు సెనెట్ మెజారిటీ (రిపబ్లికన్) నేత మిచ్ మెక్‌కన్నెల్ అంగీకారం తెలిపారు. దీంతో ప్రభుత్వ నిర్వహణకు నిధులు ఇచ్చే బిల్లుపై చర్చించేందుకు మార్గం సుగమమైంది. బిల్లుకు అనుకూలంగా ఓటేస్తామని డెమొక్రాట్ల నేత చుక్ షుమర్ ప్రకటించారు. 
జనవరి 20, 21 తేదీల్లో(శని, ఆదివారం) కనిపించని అమెరికా షట్‌డౌన్ ప్రభావం జనవరి 22న (సోమవారం) తీవ్ర ప్రభావాన్ని చూపింది. వేల మంది ప్రభుత్వోద్యోగులు వేతనాల్లేకుండా ఇళ్లలోనే ఉండటంతో కార్యాలయాలన్నీ బోసిపోయాయి. అత్యవసర సేవలు మినహా అమెరికా దాదాపుగా స్తంభించిపోయింది. 

దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సుస్విట్జర్లాండ్‌లోని ఆల్ఫ్స్ పర్వత శ్రేణుల్లోని విడిది కేంద్రం దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సు జనవరి 23న ప్రారంభమైంది. ఈ సదస్సులో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రారంభోపన్యాసం చేశారు. ఈ ప్రసంగంతో డబ్ల్యూఈఎఫ్ ప్రారంభ ప్లీనరీని ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా నిలిచిన మోదీ ‘విరోధాలు, విభేదాలు లేని.. సహకారంతో కూడిన స్వేచ్ఛాయుత స్వర్గాన్ని కలిసికట్టుగా నిర్మించాలి’ అని ప్రపంచ దేశాలకు సూచించారు. 
1997లో నాటి ప్రధాని దేవేగౌడ అనంతరం.. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. 

అమెరికా ‘షట్‌డౌన్’కు తెరఅమెరికాలో మూడు రోజులు కొనసాగిన ‘షట్‌డౌన్’ ముగిసింది. ప్రభుత్వ వ్యయానికి స్వల్పకాలిక నిధులందించే బిల్లుకు ప్రతిపక్ష డెమొక్రాట్లు మద్దతు తెలపడంతో సంక్షోభం సమసిపోయింది. ఈ బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయడంతో జనవరి 23 నుంచి రోజువారీ కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. దేశంలోకి చిన్నారులుగా తల్లిదండ్రులతో పాటు అక్రమంగా అడుగుపెట్టిన సుమారు 7 లక్షల మంది యువకుల(డ్రీమర్స్) భవిష్యత్తుపై చర్చకు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సయోధ్య కుదరడంతో సమస్య పరిష్కారమైంది. ఫిబ్రవరి 8న గడువు ముగిసే ఈ తాత్కాలిక ఫండింగ్ బిల్లు సెనేట్‌లో 81-18 ఓట్లు, ప్రతినిధుల సభలో 266-150 ఓట్ల తేడాతో గట్టెక్కింది.

2017లో 138 మంది పాక్ సైనికుల హతం జమ్మూకశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంబడి 2017లో జరిగిన సీమాంతర కాల్పులు, వ్యూహాత్మక ఘటనల్లో 138 మంది పాకిస్తాన్ సైనికులను భారత సైన్యం మట్టుబెట్టిందని ప్రభుత్వ నిఘా వర్గాలు వెల్లడించాయి. 28 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారని తెలిపాయి. 2017లో 860.. 2016లో 221 కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరిగాయని వివరించాయి. 2017 డిసెంబర్ 25న ఎల్‌ఓసీ దాటి వెళ్లి ముగ్గురు పాక్ సైనికులను మట్టుబెట్టిన ఘటననూ అందులో పేర్కొన్నాయి. సాధారణంగా పాక్ సైనికుల మరణాలను అక్కడి ఆర్మీ ధ్రువీకరించదని, కొన్ని సందర్భాల్లో సైనికుల మరణాలను పౌరుల మరణాలుగా చూపిస్తుందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి.

డిఫాల్టర్లపై చైనా కఠిన చర్యలు ఇచ్చిన రుణాలను వసూలు చేసుకోవడానికే భారత్‌లో నానా కష్టాలు పడుతుంటే చైనా ప్రభుత్వం అక్కడి డిఫాల్టర్లకు చుక్కలు చూపిస్తోంది. 2017 చివరినాటికి రుణాల ఎగవేతకు పాల్పడిన 95.9 లక్షల మంది ప్రజల్ని కోర్టులు నిషేధిత జాబితాలో చేర్చినట్లు సుప్రీం పీపుల్స్ కోర్టు(ఎస్పీసీ) తెలిపింది. డిఫాల్టర్ల రూ.1.76 లక్షల కోట్ల(27.7 బిలియన్ డాలర్లు) డిపాజిట్లను జప్తు చేశారు. పాస్‌పోర్టులు, గుర్తింపు కార్డుల ఆధారంగా విమానాలు, హైస్పీడ్ రైళ్లలో టికెట్లు కొనకుండా అడ్డుకున్నారు. డిఫాల్టర్లు దాఖలు చేసే రుణ, క్రెడిట్ కార్డ్ దరఖాస్తుల్ని తిరస్కరించేందుకు బ్యాంకులతో కలిసి పనిచేశారు. నిషేధిత జాబితా లోని వ్యక్తులు కార్పొరేట్ సంస్థల ప్రతినిధులుగా ఇకపై ఉండలేరు.

పాక్‌కు మిలటరీ సాయం నిలిపివేస్తామని అమెరికా ప్రకటన ఉగ్రవాదానికి వంతపాడుతున్న పాకిస్తాన్‌కు అమెరికా ఏటా భారీగా ఇస్తున్న మిలటరీ సాయాన్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. 2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.12.66 వేల కోట్లు) భద్రతా సాయంలో కోతతో పాటు మిలటరీ సామగ్రి సరఫరాను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. అఫ్గానిస్తాన్ తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్‌తో సహా పలు ఉగ్రవాద సంస్థలను అడ్డుకోవటంలో, పాక్‌లో వారి స్థావరాలను నిర్వీర్యం చేయటంలో విఫలమైనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్ల్లు ప్రకటించింది. అమెరికా కోరుకుంటున్నట్లు ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంటే సాయం మళ్లీ మొదలవుతుందని సూచించింది. అయితే.. అమెరికా, అంతర్జాతీయ సమాజం కోరుకున్నట్లే వ్యవహరిస్తున్నామని పాక్ పేర్కొంది. 

అమెరికా-మెక్సికో గోడకు 1.14 లక్షల కోట్లు మెక్సికో సరిహద్దులో గోడనిర్మించడానికి వచ్చే పదేళ్ల కాలానికి సుమారు రూ.1.14 లక్షల కోట్లు కేటాయించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాంగ్రెస్‌కు విజ్ఞప్తి చేశారు. సరిహద్దు రక్షణకు మొత్తం సుమారు రూ.2.09 లక్షల కోట్లు అవసరమని అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం ఒక అంచనా పత్రాన్ని విడుదల చేసింది. అందులో గోడ నిర్మాణానికి రూ.1.14 లక్షల కోట్లు, సాంకేతిక పరికరాలకు సుమారు 36 వేల కోట్లు, రోడ్డు నిర్మాణం, నిర్వహణ తదితరాలకు సుమారు రూ.6 వేల కోట్ల చొప్పున ప్రతిపాదించారని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. అంతా అనుకున్నట్లు జరిగితే 2027 నాటికి అమెరికా నుంచి మెక్సికోను వేరు చేస్తూ 1552 కి.మీ మేర గోడ లేదా కంచె పూర్తవుతుంది.
 
పాక్‌లో వేళ్లూనుతున్న ఐఎస్ కిరాతకమైన ఐఎస్ ఉగ్రవాదం పాకిస్తాన్‌లో చాలా వేగంగా విస్తరిస్తోందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పీస్ స్టడీస్ (పీఐపీఎస్) సంస్థ తాజా గణాంకాలు విడుదల చేసింది. పాక్‌లో ఐఎస్ ప్రభావం ఉత్తర సింధ్, బలూచిస్తాన్ ప్రాంతాల్లో విసృ్తతంగా ఉందని పిప్స్ పేర్కొంది. ఇటీవల బలూచిస్తాన్‌లో ఇద్దరు చైనీయుల హత్యకు పాల్పడింది ఈ ఉగ్రవాద సంస్థేనని తెలిపింది. ‘స్పెషల్ రిపోర్ట్ 2017’ పేరుతో విడుదల చేసిన సర్వేలో పాకిస్తాన్ ఎదుర్కొంటున్న భద్రతాపరమైన సవాళ్లను పిప్స్ నిర్వాహకులు పేర్కొన్నారు. బలూచిస్తాన్ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న సంస్థల కన్నా తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్, జమాతుల్ అహ్రార్ సంస్థలు పాక్ అంతర్గత భద్రతకు ప్రమాదకరంగా మారుతున్నాయని పేర్కొంది. 2016తో పోలిస్తే 2017లో పాకిస్తాన్‌పై సీమాంతర దాడులు 131 శాతం పెరిగాయని తెలిపింది. 


ఉభయ కొరియాల మధ్య మిలటరీ హాట్‌లైన్ ఉభయ కొరియా దేశాల మధ్య రెండేళ్ల తరువాత మళ్లీ చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వచ్చే నెలలో దక్షిణ కొరియాలో జరిగే వింటర్ ఒలింపిక్స్‌కు తన బృందాన్ని పంపడానికి ఉత్తర కొరియా అంగీకరించింది. అలాగే దక్షిణ కొరియాతో మిలటరీ హాట్‌లైన్ సర్వీసును పునఃప్రారంభించినట్లు వెల్లడించింది. అణు పరీక్షలతో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో దక్షిణ కొరియాతో సంబంధాలు మెరుగుపరచుకోవడానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్ ఉన్ చొరవ చూపడంతో ఇరు దేశాల సరిహద్దు గ్రామం పాన్‌మున్‌జోమ్‌లో జనవరి 9న ఈ చర్చలు మొదలయ్యాయి.

సయీద్ ర్యాలీలో పాల్గొన్న పాలస్తీనా రాయబారిముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌తో కలిసి పాకిస్తాన్‌లోని పాలస్తీనా రాయబారి అబు అలీ వేదిక పంచుకోవడాన్ని భారత్ తప్పుపట్టింది. పాలస్తీనా రాయబారి అద్నన్ హైజాను విదేశాంగ కార్యాలయానికి పిలిపించి భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో పాలస్తీనా.. పాక్‌లోని తమ రాయబారికి ఉద్వాసన పలికింది. ఈ సంఘటనపై తీవ్ర పశ్చాత్తాపం వెలిబుచ్చడంతో పాటు సయీద్ కార్యక్రమంలో తమ రాయబారి పాల్గొనడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని పాలస్తీనా స్పష్టం చేసినట్లు భారత్ తెలిపింది. 

సంక్షోభ ప్రాంతాల్లో చిన్నారుల పరిస్థితి దారుణం ఇరాక్, సిరియా, యెమెన్, నైజీరియా, దక్షిణ సూడాన్, మయన్మార్ తదితర దేశాల్లోని సంక్షోభ ప్రాంతాల్లో చిన్నారుల పరిస్థితి దారుణంగా ఉందని యునిసెఫ్ వెల్లడించింది. తీవ్రవాద గ్రూపుల కబంధహస్తాల్లో చిక్కుకున్న కొందరు పిల్లలు అక్కడి నుంచి బయటపడ్డాక భద్రతా బలగాల చేతుల్లో పడి మరోసారి అణచివేతకు, వేధింపులకు గురవుతున్నారని పేర్కొంది. ఈ పిల్లల పాలిట 2017 క్రూరమైన ఏడాదిగా నిలుస్తోందని యూనిసెఫ్ తాజా నివేదిక ఆందోళన వెలిబుచ్చింది.
నివేదికలోని ముఖ్యాంశాలు..
  • నైజీరియా, ఛాద్, నైజర్, కేమరూన్‌లలో విస్తరించి ఉన్న బోకో హరం’ ఉగ్రవాద సంస్థ 2016 కంటే 2017లో అయిదు రెట్లు ఎక్కువగా పిల్లలను ఆత్మాహుతి దళాలుగా మార్చింది.
  • తిరుగుబాటు ద్వారా సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్‌లో బోకోహరం ఆధిపత్యంపెరిగాక ఎంతోమంది పిల్లలు హత్యాచారాలకు గురయ్యారు. బలవంతంగా సాయుధ ముఠాల్లో చేర్చారు.
  • కాంగోలో రాజకీయ, సాయుధ హింస కారణంగా 8.5 లక్షల మంది పిల్లలు ఇళ్లకు దూరమయ్యారు.
  • సోమాలియాలో 2017 అక్టోబర్ కల్లా 1800 మంది పిల్లలను సాయుధగ్రూపుల్లో చేర్చుకున్నారు. దక్షిణ సూడాన్‌లో 19 వేల మంది పిల్లలు కూడా ఈ జాబితాలో భాగంగా ఉన్నారు.
  • మూడేళ్ల అంతర్గత సంక్షోభం కారణంగా యెమెన్‌లో 5,000 మంది అమాయక చిన్నారులు మరణించారు. 18 లక్షల మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు.
  • ఇరాక్, సిరియాలో పిల్లలు మానవకవచాలుగా ఉపయోగపడుతున్నారు. ఈ ఏడాది అఫ్గానిస్తాన్‌లో 700 మంది పిల్లలు చనిపోయారు.
  • రోహింగ్యాల పిల్లలను ఒక క్రమపద్ధతిలో మయన్మార్ నుంచి బయటకు తరిమేస్తున్నారు. ఆ దేశంలోని సగానికి పైగా రోహింగ్యాలు పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌కు పారిపోయేలా అక్కడి ప్రభుత్వం దాడులు, హింసాకాండకు దిగింది.


పాక్‌కు ఆర్థిక సాయం నిలిపివేస్తామని అమెరికా హెచ్చరికఇన్నాళ్లూ తమకు అండగా ఉండేందుకు పాక్‌కు ఆర్థికసాయం చేస్తున్నప్పటికీ.. పాక్ మాత్రం పచ్చి అబద్ధాలతో మోసం చేస్తూవస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. ఇన్నాళ్లుగా అందిస్తున్న సాయం ఇకపై ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. సాయం కొనసాగిస్తున్నందుకు అమెరికా నేతలను మూర్ఖులనుకుంటున్నారా? అని ట్వీటర్‌లో జనవరి 1న ఘాటుగా విమర్శించారు. సాయం రూపంలో అమెరికా నుంచి భారీ మొత్తం అందుతున్నప్పటికీ.. పాక్ అవాస్తవాలతో తమను మోసం చేస్తోందని ఆరోపించారు. ఇప్పటివరకు 33 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.2.1 లక్షల కోట్లు) సాయం అందిస్తే.. ప్రతిగా పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాద కేంద్రాలకు రక్షణ కల్పిస్తోందని మండిపడ్డారు. ట్రంప్ ట్వీట్‌కు సరైన సమాధానమిస్తామని పాక్ ప్రతిస్పందించింది. ఉగ్రవాదంపై ప్రపంచానికి వాస్తవాలు చెబుతామని పేర్కొంది. ట్రంప్ పాక్‌ను హెచ్చరిస్తూ చేసిన ట్వీట్.. ప్రధాని మోదీ దౌత్యనీతి ఫలితమేనని బీజేపీ పేర్కొంది. 

సౌదీ, యూఏఈలో తొలిసారి వ్యాట్ఇంతవరకూ పన్ను రహిత దేశాలుగా పేరుపడ్డ సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లు గల్ఫ్‌లో తొలిసారి విలువ ఆధారిత పన్ను(వ్యాట్)ను జనవరి 1 నుంచి అమల్లోకి తెచ్చాయి. సౌదీ అరేబియా కొత్త సంవత్సరం రోజున.. పెట్రోల్ ధరల్ని 127 శాతం పెంచింది. ఆదాయాన్ని పెంచుకోవడం, ప్రపంచ ధరల్లో మాంద్యం కారణంగా ఏర్పడ్డ బడ్జెట్ లోటును పూడ్చుకునేందుకు గత రెండేళ్లుగా గల్ఫ్‌లోని ముడిచమురు ఉత్పత్తి దేశాలు చర్యలు కొనసాగిస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా వ్యాట్‌ను అమల్లోకి తెచ్చారు. అధిక శాతం వస్తువులు, సేవలకు వర్తించే ఐదు శాతం అమ్మకం పన్నుతో రెండు ప్రభుత్వాలు 2018లో 21 బిలియన్ డాలర్లు వసూలు చేయవచ్చని అంచనా. 


ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడికి మూడేళ్లు జైలున్యాయ వ్యవస్థను దూషించినందుకు ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ మోర్సీకి ఆ దేశ న్యాయస్థానం డిసెంబర్ 30న మూడేళ్ల జైలుశిక్షతోపాటు 20 లక్షల పౌండ్ల జరిమానా విధించింది.

లైబీరియా కొత్త అధ్యక్షుడిగా జార్జ్ వేహ్లైబీరియాలో జరిగిన ఎన్నికల్లో దేశ అధ్యక్షుడిగా జార్జ్ వేహ్ ఎన్నికైనట్లు ఎన్నికల బోర్డ్ డిసెంబర్ 29న ప్రకటించింది. ఆయన జనవరి 22న అధ్యక్ష పదవి చేపట్టనున్నారు.



డిసెంబర్ 2017 అంతర్జాతీయం

బ్రెగ్జిట్ ప్రక్రియకు తుది గడువు 2020 యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలిగే బ్రెగ్జిట్ ప్రక్రియకు 2020, డిసెంబర్ 31ను తుది గడువుగా నిర్ణయించారు. ఆ గడువు అనంతరం 28 సభ్య దేశాల కూటమి నుంచి బ్రిటన్ వైదొలిగినట్లుగా పరిగణిస్తామని ఈయూ పేర్కొంది. బ్రిటన్‌తో భవిష్యత్తు సంబంధాలపై డిసెంబర్ 20న మార్గదర్శకాల్ని విడుదల చేస్తూ బ్రెగ్జిట్ అమలుకు వ్యవధిని నిర్దేశించింది. బ్రెగ్జిట్ అమలు సమయంలో యూరోపియన్ యూనియన్ వర్తక చట్టాల్ని బ్రిటన్ పాటించాలని, అలాగే కస్టమ్స్ నిబంధనలు, ఒకే మార్కెట్ విధానాలు కూడా వర్తిస్తాయని, అందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేసింది. 


జెరూసలేంపై అమెరికాకు వ్యతిరేకంగా ఐరాసలో తీర్మానంజెరూసలేంను ఇజ్రాయేల్ రాజధానిగా గుర్తిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఐరాస సాధారణ సభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మెజార్టీ దేశాలు ఆమోదించాయి.భారత్‌తో సహా 128 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయి. తొమ్మిది దేశాలు అమెరికా నిర్ణయాన్ని సమర్ధించగా.. 35 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. టర్కీ, యెమెన్ దేశాల ప్రతినిధులు ఐరాసలో తీర్మానాన్ని ప్రవేశపెడుతూ.. జెరూసలేం వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించాయి. అన్ని దేశాలు ఐరాస భద్రతా మండలి తీర్మానానికి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశాయి. 


ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలుఐక్యరాజ్యసమితి భద్రతామండలి డిసెంబర్ 22న ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలు విధించిం ది. ఆ దేశం నవంబర్ 29న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేపట్టడంతో భద్రతామండలి ఈ నిర్ణయం తీసుకుంది. తాజా ఆంక్షల ఫలితంగా శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులు, ముడి చమురు, విదేశాల్లోని శ్రామికుల నుంచి పొందే ఆదాయాలపై పరిమితులు ఉంటాయి.

గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్-2017 నివేదికభారత్‌లో అనారోగ్య, పర్యావరణ సమస్యలు తీవ్రంగా పెరగడానికి అత్యల్ప అక్షరాస్యతే కారణమని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడించింది. రీసైక్లింగ్ పరిశ్రమల్లో పనిచేస్తున్న లక్షలాదిమందికి అక్షరజ్ఞానం లేకపోవడం వల్లే ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన లేదని పేర్కొంది. ఈ మేరకు గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్-2017 నివేదికను డిసెంబర్ 14న విడుదల చేసింది.
2016 లో ప్రపంచవ్యాప్తంగా 44.7 మిలియన్ల మెట్రిక్ టన్నుల ఈ-వ్యర్థాలు ఉత్పత్తి కాగా, దానిలో 20 శాతం మాత్రమే రీసైక్లింగ్ చేశారు. ఈ- వేస్ట్ ఉత్పత్తిలో 7.2 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేస్తూ చైనా మొదటి స్థానంలో ఉంది. 


ఆక్స్‌ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా యూత్‌క్వేక్2017 ఏడాదికి వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా యూత్‌క్వేక్ అనే పదాన్ని గుర్తిస్తున్నట్లు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీస్ డిసెంబర్ 15న ప్రకటించింది. ఆక్స్‌ఫర్డ్ నిఘంటువు ప్రకారం యూత్‌క్వేక్ అంటే యువతరం ప్రభావం వల్ల లేదా వారి చర్యల కారణంగా వచ్చే సాంస్కృతిక, రాజకీయ, సామాజిక మార్పు’ అని అర్థం. ఈ ఏడాదిలో యువ ఓటర్లలో కలిగిన రాజకీయ చైతన్యాన్ని గుర్తిస్తూ భాషాపరమైన ఆసక్తి, దాని వాడకాన్ని పరిగణలోనికి తీసుకుని యూత్‌క్వేక్‌ను ఈ ఏడాదికి వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా గుర్తస్తున్నట్లు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీస్ తెలిపింది.


ట్వీటర్ న్యూస్ నెట్‌వర్క్ టిక్‌టాక్’వార్తల కోసం మొబైల్ ఫోన్లపైనే ఎక్కువగా ఆధారపడే వారిని దృష్టిలో ఉంచుకుని మైక్రో బ్లాగింగ్ సైట్ ట్వీటర్ తాజాగా వార్తల సర్వీసులను ప్రారంభించింది. బ్లూమ్‌బర్గ్ మీడియాతో కలిసి టిక్‌టాక్’ పేరిట అంతర్జాతీయ న్యూస్ నెట్‌వర్క్‌ను మొదలుపెట్టింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా బ్లూమ్‌బర్గ్ జర్నలిస్టులు రిపోర్ట్ చేసే వార్తలు, లైవ్ వీడియోలు ఉంటాయి. వీక్షకులు పంపే బ్రేకింగ్ న్యూస్ కంటెంట్‌ను కూడా బ్లూమ్‌బర్గ్ ఎడిటర్లు ధృవీకరించుకుని, ఎడిట్ చేసి అందిస్తారు. ఈ టిక్‌టాక్ న్యూస్ సర్వీసు కోసం బ్లూమ్‌బర్గ్ సంస్థ... ఎడిటర్లు, ప్రొడ్యూసర్లు, సోషల్ మీడియా అనలిస్టులు, ప్రోడక్ట్ డెవలపర్స్, ఇంజినీర్లు, డిజైనర్లు మొదలైన వారితో ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసింది. 


జెరూసలేం’ తీర్మానంపై అమెరికా వీటో జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని యూఎస్ వీటో చేసింది. ఆరేళ్ల కాలంలో, ట్రంప్ హయాంలో అమెరికా ఈ హక్కును వినియోగించుకోవడం ఇదే తొలిసారి. ఈజిప్టు రూపొందించిన ఈ తీర్మానాన్ని భద్రతా మండలిలో అమెరికా మిత్ర దేశాలైన జపాన్, ఫ్రాన్స్, బ్రిటన్ కూడా సమర్థించాయి. 
50 ఏళ్లుగా జెరూసలేంపై ఇజ్రాయెల్ సార్వభౌమ హక్కులను వ్యతిరేకిస్తున్న భద్రతా మండలి మరోసారి అదే వైఖరిని ఉద్ఘాటించింది. ట్రంప్ నిర్ణయంతో మధ్యప్రాచ్య ప్రాంతంలో శాంతి పునరుద్ధరణ ప్రక్రియకు విఘాతం కలుగుతుందని, అది ఉగ్రవాదులకు ఊతంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. జెరూసలేంలో దౌత్య కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవద్దని కోరింది. 


ఆస్ట్రేలియాలో స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధతస్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును ఆస్ట్రేలియన్ పార్లమెంట్ డిసెంబర్ 7న ఆమోదించింది. ఇంతకుముందు ఈ బిల్లును పార్లమెంట్ ఎగువసభ సెనేట్ 43-12 మెజారిటీతో ఆమోదించగా.. తాజాగా ప్రతినిధుల సభ (దిగువ సభ) 146-4 మెజారిటీతో ఆమోదం తెలిపింది. తాజా చట్టం ప్రకారం ఇకపై స్వలింగ సంపర్కులు తమ వివాహానికి నోటీస్ దాఖలు చేసి 30 రోజుల తర్వాత వివాహం చేసుకోవచ్చు.


సౌదీలో సినిమాలపై నిషేధం ఎత్తివేతసౌదీ అరేబియాలో 35 సంవత్సరాల కింద సినిమా ప్రదర్శనలపై విధించిన నిషేధాన్ని రాజు మహ్మద్ బిన్ సల్మాన్ డిసెంబర్11న ఎత్తివేశారు. దీంతో చలన చిత్రాలకు అనుమతుల మంజూరు తక్షణం అమల్లోకి వచ్చి 2018లో వాణిజ్య సినిమాల ప్రదర్శన ప్రారంభం కానుంది. సినిమాలు నైతిక విలువలను మంటగలుపుతాయని, సాంస్కృతిక, మత విశ్వాసాలకు విఘాతం కలిగిస్తాయని ఛాందసవాదులు ఆందోళన చేయడంతో 1980ల్లో వీటిపై నిషేధం విధించారు. ఇటీవల సౌదీలో మహిళలను డ్రైవింగ్, క్రీడామైదానాల్లోకి అనుమతించడం వంటి కీలక సంస్కరణలు చేపట్టారు.


జెరూసలేం పాలస్తీనాదే : ఓఐసీఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న తూర్పు జెరూసలేంను పాలస్తీనా రాజధానిగా గుర్తించాలని ముస్లిం దేశాధినేతలు పిలుపునిచ్చారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ డిసెంబర్ 13న నిర్వహించిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్ (ఓఐసీ) సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ డిక్లరేషన్‌లో తూర్పు జెరూసలేంను పాలస్తీనా రాజధానిగా పేర్కొంటూ పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాలని అన్ని దేశాలను కోరారు.
జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం చట్టబద్ధంగా చెల్లదని, తమ ప్రాంతంలో శాంతి ప్రక్రియను అమెరికా కాకుండా ఐక్యరాజ్య సమితి చేపట్టాలని కోరారు.


విధ్వంసక ఖండాంతర క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియాఅమెరికా, అంతర్జాతీయ సమాజం హెచ్చరికలు పెడచెవినపెడుతూ ఉత్తర కొరియా మూడోసారి అణ్వాయుధ సామర్థ్యమున్న ఖండాంతర క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. దీంతో తాము పూర్తిస్థాయి అణ్వాయుధ దేశంగా అవతరించామని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నవంబర్ 29న ప్రకటించారు. ఉత్తర కొరియా ప్రయోగాన్ని ఐరాస, అమెరికా, చైనా, రష్యా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా దేశాలు ఖండించాయి.
కొరియా పరీక్షించిన మూడో ఖండాంతర క్షిపణి అయిన హవాసాంగ్-15 భారీ అణు వార్‌హెడ్లను మోసుకెళ్తూ అమెరికాలోని ఏ ప్రాంతాన్నైనా లక్ష్యంగా చేసుకోగలదు. ఇది 4,475 కి.మీ ఎత్తు చేరుకుని, ప్రయోగ స్థానం నుంచి సుమారు వేయి కి.మీ దూరంలో ఉన్న జపాన్ సముద్రంలో లక్ష్యాన్ని చేధించిందని ఉత్తర కొరియా అధికారికంగా ప్రకటించింది.


ఆటోమేషన్ వల్ల 80 కోట్ల ఉద్యోగాలు కోతరోబోలు, ఆటోమేషన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి 80 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ప్రముఖ రీసెర్చ్ సంస్థ మెకిన్సే వెల్లడించింది. 46 దేశాల్లో నిర్వహించిన సర్వే వివరాలను మెకిన్సే నవంబర్ 29న వెల్లడించింది. దీని వల్ల మెషీన్ ఆపరేటర్లు, ఫాస్ట్ ఫుడ్ వర్కర్లు, బ్యాక్-ఆఫీస్ ఉద్యోగులు ఎక్కువగా నష్టపోతారని తెలిపింది. దీంతో అభివృద్ధి చెందిన దేశాలు, వర్ధమాన దేశాలు రెండూ కూడా ప్రతికూల ప్రభావం ఎదుర్కోనున్నాయి. 
ఆటోమేషన్ వల్ల భారత్‌లో 11-12 కోట్ల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోవచ్చని మెకిన్సే అంచనా వేసింది. అత్యధికంగా చైనాలో దాదాపు 20 కోట్ల మందిపైగా ఉపాధి కోల్పోగా అమెరికాలో 5-8 కోట్ల మంది ఉద్యోగాలకు ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది.

ఉత్తర కొరియాను ధ్వంసం చేస్తాం : అమెరికాఉత్తర కొరియా చేస్తున్న వరుస క్షిపణి పరీక్షలు యుద్ధానికి దారితీస్తే.. ఆ దేశాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తామని అమెరికా తీవ్రంగా హెచ్చరించింది. ఆ దేశంతో ఆర్థిక, రాజకీయ సంబంధాలను తెంచుకోవాలని ఇతర దేశాలకు పిలుపునిచ్చింది. ఉత్తర కొరియా నవంబర్ 29న పరీక్షించిన హవాసాంగ్-15 క్షిపణి విజయవంతమైన నేపథ్యంలో ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలిలో జరిగిన అత్యవసర సమావేశంలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ ఈ విధంగా స్పందించారు. 
ఉత్తర కొరియా తాజాగా పరీక్షించిన హవాసాంగ్-15 క్షిపణి, జూలైలో పరీక్షించిన హవాసాంగ్-14తో పోలిస్తే ఎంతో శక్తిమంతమైనది. ఇది ప్రపంచంలో ఏ ప్రాంతాన్నైనా లక్ష్యంగా చేసుకోగలదని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్న వెల్లడించారు.


ట్రావెల్ బ్యాన్ కు అమెరికా సుప్రీం కోర్టు ఆమోదంఆరు ముస్లిం దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ప్రయాణ నిషేధ ఉత్తర్వుల అమలుకు ఆ దేశ సుప్రీంకోర్టు డిసెంబర్ 5న ఆమోదం తెలిపింది. దీంతో ఇరాన్, లిబియా, సిరియా, యెమెన్, సోమాలియా, చాడ్ దేశాల ప్రజలు అమెరికాకు రావాలంటే ఇక్కడి వారికి సంబంధించినవారమని సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. అయితే, ఈ ఉత్తర్వులు ముస్లింలపై వివక్ష చూపేవిగా ఉన్నాయంటూ హవాయి, మేరీల్యాండ్ కోర్టులు స్టే విధించాయి. దీంతో ట్రంప్ ప్రభుత్వం కొన్ని మినహాయింపులను ప్రకటించింది.


టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా సెలైన్స్ బ్రేకర్స్’లైంగిక వేధింపులు, దాడులను ధైర్యంగా ప్రపంచం దృష్టికి తీసుకొచ్చిన సెలైన్‌‌స బ్రేకర్స్’ను టైమ్ మేగజీన్ 2017 సంవత్సరానికి పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ప్రకటించింది. హాలీవుడ్ నిర్మాత హార్వే వీన్‌స్టెయిన్ లైంగికంగా వేధించాడంటూ ఇటీవల పలువురు నటీమణులు, మోడళ్లు ప్రకటించడంతో తాము కూడా లైంగిక దాడులకు గురయ్యామని మీ టూ హ్యాష్‌ట్యాగ్’ ద్వారా చాలా మంది మహిళలు తమ బాధలను పంచుకున్నారు. వీరినే సెలైన్స్ బ్రేకర్స్’గా పరిగణిస్తున్నారు. ఈ ఏడాది పర్సన్ ఆఫ్ ది ఇయర్’ రేసులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో స్థానంలో నిలిచారు.
నేచర్ ఫొటోగ్రాఫర్ కెమెరాతో సెల్ఫీ తీసుకుని ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన ఇండోనేసియా కోతి నరుటో’ ఈ ఏడాది పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికైంది. మకక్వీ జాతికి చెందిన ఆరేళ్ల నరుటోను పెటా’ సంస్థ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. 2011లో బ్రిటిష్ ఫొటోగ్రాఫర్ డేవిడ్ స్లేటర్ అడవిలో అమర్చిన కెమెరాను చేతిలోకి తీసుకుని ఈ కోతి కొన్ని సెల్ఫీలు తీసుకుంది.


జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించిన ట్రంప్ఇజ్రాయెల్ రాజధానిగా ప్రస్తుత టెల్ అవీవ్ స్థానంలో జెరూసలేంను గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిసెంబర్ 6న కీలక నిర్ణయం తీసుకున్నారు. టెల్ అవీవ్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరూసలేంకు తరలించే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని అమెరికా విదేశాంగ శాఖను ఆదేశించారు. జెరూసలేం మూడు గొప్ప మతాలకు (ముస్లింలు, క్రైస్తవులు, యూదులు) ప్రధాన కేంద్రం అని వారందరు కలిసే దేశాన్ని నిర్మించారని పేర్కొన్నారు. ఇజ్రాయెల్-పాలస్తీనా ఇరు దేశాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా శాంతి ఒప్పందం కుదరడంలో సాయమందించేందుకు అమెరికా ముందుంటందని తెలిపారు.